రాజమండ్రి లోక్‌సభపై వైసీపీ గురి: బరిలోకి దిగనున్న మంత్రి చెల్లుబోయిన వేణు ?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుబులు మెుదలైందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే గెలుపు అంటూ అనేక సర్వేలు తేటతెల్లం చేశాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుబులు మెుదలైందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే గెలుపు అంటూ అనేక సర్వేలు తేటతెల్లం చేశాయి. దీంతో వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమాగా ఉంది. ఆ సర్వేలను బేస్ చేసుకుని ఏకంగా సీఎం వైఎస్ జగన్ వైనాట్ 175 అంటున్నారు. ఇంతలో ఇండియా టుడే- సీ ఓటర్ సర్వేలో గూబ గుయ్ మనేలా ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ 15 నుంచి 20 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ గెలుపొందుతుందని స్పష్టం చేసింది. దీంతో వైసీపీలో కలవరపాటు మెుదలైంది. వైసీపీ అధిష్టానం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎంపీలు మళ్లీ టికెట్ ఇస్తే గెలుస్తారా?లేకపోతే అసెంబ్లీకి పంపాలా? ఇప్పటికే అనేక మంది ఎంపీలు అసెంబ్లీ బరిలో నిలవాలని చూస్తున్నారు..? అలాంటి వారికి ప్రత్యామ్నాయం ఏంటి? ఎంపీలు అత్యధికంగా ఉండబట్టే ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాం. వచ్చే ఎన్నికల్లో ఎంపీల సంఖ్య పడిపోతే ఢిల్లీలో మనలను పట్టించుకునే నాదుడే ఉండడు అని వైసీపీ అధిష్టానంలోని పెద్దలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులపై గట్టి కసరత్తు పెట్టాలని వైసీపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజమహేంద్రవరం లోక్‌సభపై ఫోకస్
ఇకపోతే రాజకీయంగా చైతన్యవంతం అయిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీ అభ్యర్థులపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థిపై చాలా పెద్ద కసరత్తే చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాజమహేంద్రవరం ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్ రామ్ వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పైకి అధిష్టానం పోటీ చేయమంటే ఎంపీగా బరిలోకి దించుతానని పైకి చెప్తున్నప్పటికీ లోలోన మాత్రం అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సెగ్మెంట్‌పై వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా బీసీ(గౌడ) సామాజిక వర్గానికి చెందిన మార్గాని భరత్ రామ్‌ను బరిలోకి దించింది. ఆ ప్రయోగం సక్సెస్ అయ్యింది. అయితే ఈసారి వ్యూహాత్మకంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీసీ శెట్టిబలిజ అభ్యర్థిని బరిలోకి దించే యోచనలో వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈసారి శెట్టిబలిజలకే
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబలిజ సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నాయకులు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణలు. వైసీపీలో ఇద్దరూ హేమాహేమీలే. అంతేకాదు ఇరువురు ప్రాతినిధ్యం వహిస్తుంది కూడా డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచే. అయితే 2024 ఎన్నికల్లో టికెట్ విషయంలో ఈ ఇద్దరు నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇరువురు మధ్య ఒక మినీ యుద్ధమే నడుస్తుందని చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం రామచంద్రాపురం టికెట్ బంతి వైఎస్ జగన్ కోర్టులోనే ఉంది. అటు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇటు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణలు ఇద్దరూ వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు కావడంతో ఎవరిని బుజ్జగించాలి..ఎవరిని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి అనేదానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్సర్‌సైజ్ చేసినట్లు తెలుస్తోంది.
పంచాయతీకి ఫుల్ స్టాప్
అటు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇటు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణల పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు వైసీపీ అధిష్టానం ఒక కొత్త ప్రపోజల్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను రాజమహేంద్రవరం లోక్‌సభ టికెట్ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలే మంత్రి. అందులోనూ బీసీ సామాజిక వర్గంలో మంచి పట్టున్న నాయకుడు. వైఎస్ జగన్‌కు అత్యంత ఆప్తుడు కావడంతో ఆయనను రాజమహేంద్రవరం పార్లమెంట్ బరిలో దించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రామచంద్రాపురం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడుకి ఇస్తారని తెలుస్తోంది. అప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి విభేధాలు లేకపోగా పార్టీలో అసమ్మతి పోతుందని భావిస్తోంది. వేణును ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించితే గెలుపు మరింత ఈజీ అవుతుందని అధిష్టానం భావిస్తోంది. మరి ఈ ప్రపోజల్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది..? అసలు పట్టాలెక్కుతుందా? లేకపోతే మంత్రి వేణు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల మధ్య రాజీకి వేరే అస్త్రం ఏమైనా ఉపయోగించనుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.