పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ పార్టీదే.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపి, వైసీపీ పార్టీలేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు...

Update: 2024-06-29 11:58 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపి, వైసీపీ పార్టీలేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె పోలవరం  ప్రాజెక్టు కట్టి 28 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం దివంగత ముఖ్యమంత్రి YSR ఆశయమయితే, పంతాలు పట్టింపులకు పోయి జీవనాడిపై ఇన్నాళ్లు జరిగింది రాజకీయ దాడి తప్పా మరోటి కాదన్నారు. విభజన సమయంలో పోలవరానికి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే మోడీ సర్కార్ ఆ బాధ్యత 10 ఏళ్లు విస్మరించి నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపిందని షర్మిల మండిపడ్డారు.

కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ను తానే కడతానని చెప్పి చంద్రబాబు పోలవరం, సోమవారం అంటూ హడావిడి చేశారు తప్ప.. మొదటి 5 ఏళ్లలో చేసింది శూన్యమని షర్మిల విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ అంచనా వ్యయం పెంచాడే తప్పా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఎద్దేవా చేశారు. రూ.10 వేల కోట్లతో కాంగ్రెస్ హయాంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు నిర్లక్ష్యం ఖరీదు అక్షరాల 76 వేల కోట్లు అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్ కట్టాలంటే మరో 5 ఏళ్లు పడుతుందని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. మోడీ పిలక తమ చేతుల్లోనే ఉందన్న విషయం మరిచిపోవద్దని సూచించారు. కేంద్రాన్ని శాసించే అధికారం చంద్రబాబు దగ్గరుంది కాబట్టి పూర్తి స్థాయి నిధులు తెచ్చి, రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా పోలవరం పూర్తి చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Similar News