AP కాంగ్రెస్‌లో నయా జోష్.. ఊహించని రేంజ్‌లో హస్తానికి హైప్ తీసుకొచ్చిన YS షర్మిల..!

షర్మిల రాకతో రాష్ట్ర కాంగ్రెస్​శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఎన్నికల బరిలో దిగేందుకు నేతలు పోటీపడుతున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున

Update: 2024-02-11 02:00 GMT

షర్మిల రాకతో రాష్ట్ర కాంగ్రెస్​శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఎన్నికల బరిలో దిగేందుకు నేతలు పోటీపడుతున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున దరఖాస్తులు దాఖలు చేశారు. శనివారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి 800కు పైగా అప్లికేషన్లు అందాయి. ఇతర పార్టీల అభ్యర్థులు ఖరారైతే ఆశావహుల సంఖ్య పెరగొచ్చని ఈ నెలాఖరుదాకా గడువును పొడిగిస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు బీజేపీ కనుసన్నల్లోకి వెళ్లడంతో కాంగ్రెస్​ పార్టీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తానే వైఎస్సార్ వారసురాలినని షర్మిల ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ తొత్తులుగా మారి ప్రత్యేక హోదా, విభజన హామీలకు మంగళం పాడాయని దుయ్యబడుతున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కాకుండా కాపాడాలన్నా, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలన్నా కాంగ్రెస్​కే సాధ్యమని చెబుతున్నారు.

తొలి సంతకం ఆ ఫైలుపైనే..

కేంద్రంలో అధికారానికి వస్తే ప్రత్యేక హోదా, విభజన హామీల ఫైలుపై కాంగ్రెస్​ తొలి సంతకం ఉంటుందని షర్మిల భరోసా ఇస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్​ ను రద్దు చేసి రాష్ట్రాలే పన్నులు వసూలు చేసుకోవడం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించడానికి కృషి చేస్తామని హామీనిస్తున్నారు. నిత్యావసరాలపై జీఎస్టీ రద్దు చేస్తామంటున్నారు. పెట్రోలు, డీజిల్​, వంట గ్యాస్​ ధరలను నేలపైకి తెస్తామంటూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తటస్థులను సైతం ఆలోచింపజేస్తున్నారు.

షర్మిల సభలు సక్సెస్..

షర్మిల రచ్చబండ, బహిరంగ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. కాంగ్రెస్​ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటిదాకా ఒక్కో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గానికి ఐదు చొప్పున దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా రద్దీ తగ్గకపోవడంతో తుది గడువు ఫిబ్రవరి 29 వరకు పొడిగిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. వైసీపీ, టీడీపీ కూటమిలో సీట్లు దక్కని నేతలు కాంగ్రెస్​ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఖరారయ్యేదాకా వేచి చూడాలని కాంగ్రెస్​ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతున్నదంటే..

అధికార వైసీపీ ఇప్పటిదాకా ఆరు విడతల్లో సుమారు 70 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా వందకు పైగా సీట్లలో కొంతమంది సిట్టింగు ఎమ్మెల్యేలను కొనసాగించినా కొన్ని మార్పులు, చేర్పులు ఉండొచ్చు. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ చేరే అవకాశాలున్నాయి. తమకు 6 ఎంపీ, 15 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది.

వారికి హస్తం పార్టీనే దిక్కు..

మూడు పార్టీల పొత్తులో సీట్లు గల్లంతయ్యే నేతలకు కాంగ్రెస్​ పార్టీ తప్ప మరో గత్యంతరం లేదు. అందుకే కాంగ్రెస్​ అధిష్టానం వేచి చూసే ధోరణితో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇదే దూకుడును కొనసాగిస్తే రాష్ట్రంలో త్రిముఖ పోరు రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


Similar News