Breaking: తిరుపతి పర్యటన రద్దు తర్వాత వైఎస్ జగన్ కీలక ప్రకటన

తిరుపతి పర్యటన రద్దు తర్వాత వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు..

Update: 2024-09-27 10:34 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుంటే అడ్డుకోవడం ఇదే తొలిసారి అని వైఎస్ జగన్ (Ys Jagan) మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యాన్ని చూస్తున్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల (Tirumala) పర్యటనకు అనుమతి లేదని, ఎవరు అతిక్రమించినా అరెస్ట్ చేస్తామని తనకు నోటీసులు ఇచ్చారన్నారు. ‘‘మనం ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా. నన్ను, మా కార్యకర్తలను తిరుపతికి వెళ్లనివ్వడం లేదు. మమ్మల్ని అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల బీజేపీ వాళ్లు తిరుపతికి వస్తున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద వేల మంది పోలీసులు మోహరించినట్లు చూపిస్తున్నారు. డైవర్ట్ పాలిటిక్స్ కోసం లడ్డూ వ్యహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని ఒక్కొక్కటిగా రుజువు అవుతున్నాయి. చంద్రబాబు 100 రోజుల పాలనపై విమర్శలు చేయకుండా ఉండేందుకు లడ్డూల టాపిక్ తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ టాపిక్‌ను తీసుకొచ్చారు.’’ అని జగన్ వ్యాఖ్యానించారు.

తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను, పేరు ప్రఖ్యాతలను చంద్రబాబు దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ‘‘జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారైనట్టుగా, జరగని విషయాన్ని జరిగినట్టుగా, కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతూ రాజకీయ దుర్బుద్ధితో శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుపతిలో నెయ్యి కొనుగోలు ప్రతి ఆరు నెలలకోసారి జరిగే కార్యక్రమం. ఈ టెండర్ల ద్వారా క్వాలీఫై అయిన సంస్థలకు నెయ్యి సరఫరా అప్పగిస్తారు. తక్కువ డబ్బులకు ఎవరు కోట్ చేస్తే వారికే నెయ్యి సరఫరాను అప్పగిస్తారు. టీటీడీ కూడా ప్రసిద్ధిగాంచినదే. దేశంలోని చాలా మందికి బోర్డు సభ్యత్వాలు ఉంటాయి. సభ్యులు కూడా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు. పారదర్శకంగా సేవ చేయాలనే ఆలోచనలు చేస్తారు. ఇవన్నీ ఇప్పటివి కావు.’’ అని జగన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News