లీడర్ జంప్.. అయోమయంలో కేడర్...!

విశాఖలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది...

Update: 2024-06-30 02:26 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఇలా అధికారం పోయిందో లేదో అలా నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. వైసీపీ కార్యనిర్వాహక రాజధానిగా అదే పనిగా ప్రచారం చేసిన విశాఖలో పార్టీ మునుగడే కష్టంగా మారింది. ఐదేళ్ల పాటు విజయసాయిరెడ్డి వీరవిహారంతో అసలే 30 శాతానికి పడిపోయిన ఓటింగ్‌తో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న వైసీపీని ఇప్పుడు నడిపించే నాయకుడే కనిపించడం లేదు. మాజీ ప్రజా ప్రతినిధులు, విశాఖ లోని వివిధ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలు పార్టీకి మొహం చాటేస్తున్నారు. అంతే కాదు పార్టీ మారే ప్రయత్నాలు చేస్తుండడం ఇప్పుడు పార్టీ కార్యకర్తలను కలవర పెడుతోంది.


ఎంవీవీ పరారీతో విశాఖ తూర్పులో గందరగోళం..

విశాఖ మాజీ ఎంపీ, విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ పోలీసు కేసుల నేపథ్యంలో పరారయ్యారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌లో ఉపశమనం రాకపోవడంతో ఆ తరువాత ముందస్తు బెయిల్‌ పొందారు. అయితే, విశాఖ వస్తే మరో కేసులో అరెస్టు చేయవచ్చన్న భయం ఆయనను వెంటాడుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అక్రమాని విజయనిర్మల మూడు నెలల క్రితమే తెలుగుదేశంలో చేరిపోయారు. దీంతో ఈ నియోజక వర్గంలో నడిపించే నేతే కరువయ్యారు.

కార్పొరేటర్లను బీజేపీలోకి వెళ్లమన్న కే‌కే రాజు..

విశాఖ ఉత్తరం నుంచి 2019, 2024 సంవత్సరాల్లో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేకే రాజు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించేశారు. జగన్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో విశాఖలో అత్యంత వివాదాస్పద నేతగా పేరుపడి విశాఖ విమానాశ్రయం వద్ద తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత వవన్ కళ్యాణ్ లను అడ్డుకొని వారి కార్లపై దాడి చేసిన కేకే రాజు ఇప్పుడు ఒక్కసారిగా చప్పపడిపోయారు. తనపై కేసులు, అరెస్టులు తప్పవన్న భయంతో ముందు జాగ్రత్త చర్యగా తన అనుచరులైన కార్పొరేటర్లను తనపై విజయం సాధించిన బీజేపీ నేత పి.విష్ణు కుమార్ రాజు దగ్గరకు పంపుతున్నారు. వైసీపీ ఎంపీలు స్పీకర్ ఎన్నిక సమయంలో కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చినందున తాము బీజేపీలో చేరడం తప్పుకాదన్న ఉపదేశంతో ఆయన కార్పొరేటర్లను పార్టీ ఫిరాయింపునకు ప్రోత్సహిస్తున్నారు.

పార్టీ మారే ఆలోచనలో అడారి ..

విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వైపీపీ నేత, విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ఆయన ఆ తరువాత వైసీపీ పెద్దల బెదిరింపుల కారణంగా, వారి నుంచి విశాఖ డెయిరీను కాపాడుకొనేందుకు వైసీపీలో చేరారు. ఆయన తండ్రి తులసీరావు, కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశంతోనే వుండడంతో ఆయన తిరిగి అదే పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

మాజీ మంత్రులు నోరు విప్పితే ఒట్టు..

భీమిలి నుంచి ఓటమి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, గాజువాక నుంచి ఓడిపోయిన మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్, విశాఖ దక్షిణలో ఓటమి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఓటమి నుంచి ఇంకా బయటపడని ఈ నేతలు ఈ పార్టీలో తమ రాజకీయ భవిష్యత్‌పై అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి ఫలితాల తరువాత ఒకసారి వచ్చి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాలు, ఫిరాయింపులపై ఆయన పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.        


Similar News