వైసీపీ వ్యూహం : విలేజ్ ఓటర్ల కోసం కొత్త కార్యక్రమం.. విధివిధానాలు ఇవే!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు శరవేగంగా మారిపోతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు శరవేగంగా మారిపోతున్నాయి. మరో ఏడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుపొందాలని వ్యూహం రచిస్తోంది. వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ, జనసేనల మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు అధికారికంగా పొత్తులు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పొత్తుపై వైసీపీ విమర్శలు చేస్తున్నప్పటికీ లోలోన మదనపడుతుందనే ప్రచారం జరుగుతుంది. పొత్తు ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనని ఆందోళన చెందుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.‘పల్లెకు పోదాం’ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల వేళ మరో కీలక అడుగు
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే జనసేన-టీడీపీల మధ్య పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. పల్లెకు పోదాం అనేకార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితిపై నివేదిక రూపొందించిన ఐప్యాక్ టీం పల్లెకు పోదాం అనే కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐప్యాక్ టీం రూపొందించిన ఈ కార్యక్రమానికి వైసీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమ నిర్వహణపై సీఎం జగన్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్య నేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు అటు ఐప్యాక్ టీంతో వరుస సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే యోచనపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రోడ్ మ్యాప్ సైతం ఖరారు చేసినట్లు వెల్లడిస్తోంది. గ్రామాల్లో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాలతోపాటు, పట్టణాల్లో కూడా మరింత బలం పెంచుకునేందుకు ఈ పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ అధిష్టానం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం పట్టాలెక్కే లోపు రీజినల్ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు తీసుకుని రోడ్ మ్యాప్ తయారు చేస్తే బెటర్ అనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
మండలాధ్యక్షులే కీలకం
పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా వైసీపీ మండల అధ్యక్షులు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ప్రతీ మండల వైసీపీ అధ్యక్షుడు లబ్ధిదారులతో భేటీ కావడంతోపాటు రాబోయే రోజుల్లో వైసీపీ ఓటు బ్యాంకుపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా మండల అధ్యక్షుడు ప్రతి రోజూ తన మండల పరిధిలోని ఒక సచివాలయాన్ని ఎంపిక చేసుకుని...ఆ సచివాలయానికి ఉదయమే వెళ్లి అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అనంతరం ఆ సచివాలయం పరిధిలో లబ్దిదారుల జాబితాను విడుదల చేసి వారితో మమేకం అవుతారు. అనంతరం ముఖాముఖి నిర్వహిస్తారు. మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరనున్నారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారం అనంతరం గ్రామస్థాయిలోని పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు.గ్రామ స్థాయి నుంచి పార్టీ నాయకుల మధ్య విభేధాలపై ఫోకస్ పెడతారు. పార్టీ ముఖ్య నేతల మధ్య అగాధం పూడ్చేందుకు విందు రాజకీయం సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో చేరికలపైనా ప్రత్యేకంగా చర్చించనున్నారు.
చవితి అనంతరం సమావేశం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేపట్టిన అన్ని కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా ఈ పల్లెకు పోదాం కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ వినాయక చవితి అనంతరం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లతో తొలుత సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, మండల అధ్యక్షులను క్రియాశీలకం చేయాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఖాళీగా ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులను నియమించడంతోపాటు బూత్ కమిటీల అధ్యక్షులను కూడా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాల తర్వాతే ప్రారంభం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రారంభిస్తారని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించగా.. అనంతరం అన్ని మండలాల్లోనూ ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.