వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్ వెళ్లా.. అజ్ఞాతం ప్రచారంపై స్పందించిన పిన్నెల్లి

తాను అజ్ఞాతంలోకి వెళ్లారని జరుగుతున్న ప్రచారంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు....

Update: 2024-05-17 12:06 GMT

దిశ, వెబ్ డెస్క్: తాను అజ్ఞాతంలోకి వెళ్లారని జరుగుతున్న ప్రచారంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. మాచర్లలో జరిగిన అల్లర్ల కారణంగా ఆయనతో పాటు సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని శుక్రవారం నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని హైదరాబాద్ నుంచి ఆయన ఖండించారు. తాను వ్యక్తిగత పనుల వల్ల హైదరాబాద్ వెళ్లానని తెలిపారు. తనకు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. తమపై ఎలాంటి కేసులు లేవని చెప్పారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లాననేది అవాస్తమని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.

కాగా ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సైతం మాచర్లలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పల్నాడు ఎస్పీపై వేటు వేసింది. దాడి ఘటనలపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో ఈ దర్యాప్తునకు భయపడి పిన్నెల్లి మాచర్లను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరిగింది. గన్ మెన్లను సైతం వదిలి రాత్రికి రాత్రే మాయం అయ్యారని అటు టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో స్పందించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి త్వరలోనే మాచర్ల వస్తానని చెప్పారు.


Similar News