దెబ్బమీద దెబ్బతో వైసీపీకి దిక్కుతోచడంలేదు: అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి వస్తున్న ప్రజాధరణ, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకుంటుంటే బులుగు మందకు నిద్ర కరువైంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

Update: 2023-11-22 06:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి వస్తున్న ప్రజాధరణ, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకుంటుంటే బులుగు మందకు నిద్ర కరువైంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మొన్నటి వరకు గడపగడపకూ వెళ్లిన వైసీపీ నేతల్ని ప్రజలు ప్రశ్నలు, నిలదీతలతో ఉక్కపోత పుట్టించారు. కానీ టీడీపీ నేతల వద్దకు స్వచ్ఛందంగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో అసహనంతో పిచ్చిపట్లినట్లు వ్యవహరిస్తున్నారు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి ఏయే పథకాల ద్వారా ఎంత లబ్ది చేకూరుస్తామో చెబుతున్నారని చెప్పుకొచ్చారు. ‘మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధిగా మహిళలకు నెలకు రూ.1500, తల్లికి వందనంతో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ ఏటా రూ.15వేలు, దీపం పథకంతో ఏటా మూడు సిలిండర్లు ఉచితం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, యువగళం కింద నిరుద్యోగ భృతితో పాటు 20లక్షల ఉద్యోగాలు, రైతులకు అన్నదాత పథకం కింద ఏటా రూ.20వేలు, ఇంటింటికీ మంచినీటి కుళాయి, బీసీలకు రక్షణ చట్టంపై అవగాహన కల్పిస్తుంటే వైసీపీ ముఠాకు ఎందుకంత కోపం?’ అని అచ్చెన్నాయుడు నిలదీశారు.‘ప్రజలకు చేసే మేళ్ల గురించి చెబుతుంటే ఎందుకు జగన్ రెడ్డికి ఇంత అక్కసు? ఇంకెన్నాళ్లు ఇలాంటి తప్పుడు ప్రచారాలతో కాలం నెట్టుకొస్తారు? తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారే తప్ప.. ఎక్కడా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం లేదు’ అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కానీ జగన్ రెడ్డి ముఠా వలంటీర్ల ద్వారా కుటుంబంలోని ప్రతి వ్యక్తి వ్యక్తిగత విషయాలు సైతం సేకరిస్తున్నారని... వారి కుటుంబంలో వివాహేతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటూ వారిని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమాచారం మొత్తాన్ని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ద్వారా రామ్ ఇన్ఫోటెక్ కంపెనీకి రూ.270 కోట్లు ప్రజల సొమ్ము దోచిపెట్టి మరీ తరలిస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడంతో జగన్ రెడ్డి ముఠా వెన్నులో వణుకు మొదలైంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే తప్పుడు పార్టీని 2024 ఎన్నికల తర్వాత బంగాళాఖాతంలో కలిపేయడం తధ్యం’ అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Tags:    

Similar News