Wines are closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్.. పది రోజుల పాటు వైన్స్‌లు బంద్!

దసరా పండుగ వేళ ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది.

Update: 2024-10-02 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ వేళ ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. రాబోయే పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,240 మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈనెల 12 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గత వైసీపీ (YCP) ప్రభుత్వం హయాంలో ఓపెన్ టెండర్ (Open Tender) ప్రక్రియ లేకుండానే వైన్స్ షాపులను ప్రభుత్వమే నడిపింది. ఆ క్రమంలోనే షాపుల నిర్వహణకు గాను ఐదేళ్ల కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగులను నియమించి మద్యం అమ్మకాలను కొనసాగించారు.

కాగా, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల గడువు సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో ఇక్కడే అసలు పంచాయితీ మొదలైంది. మరో 10 రోజుల్లో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుండటంతో ఇక ఉద్యోగాలు ఉండవని కాంట్రాక్ట్ ఉద్యోగులు (Contract Employees) ఆందోళన చేస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే తాము రోడ్డున పడతామంటూ నిరసనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మద్యం షాపులు తెరవాలంటూ సర్కార్ రిక్వెస్ట్ చేసినప్పటికీ కాంట్రాక్టు ఉద్యోగులు షాపులకు రాకపోవడంతో మరో 10 రోజుల పాటు మద్యం దుకాణాలు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు.

కాగా, ఈనెల 12న నుంచి రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ (New Excise Policy) అమల్లోకి రానుంది. ఇప్పటికే సర్కార్ అందుకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మంగళవారం నుంచి ఈనెల 9 వరకు ప్రైవేట్ మద్యం షాపుల కోసం అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 11న 3,396 షాపులకు లాటరీ తీసి 12న నుంచి లైసెన్స్ పొందిన వారికి ఏరియా వారీగా షాపులను కేటాయించనున్నారు. అయితే, షాపుల కేటాయింపు కోసం దరఖాస్తుదారుల నుంచి రూ.2 లక్షల రుసుముగా నిర్ణయించారు. ఒకవేళ లాటరీలో షాపు దక్కకపోతే ఆ డబ్బు తిరిగి వెనక్కి ఇవ్వబడదు. అదేవిధంగా జనాభాను బట్టి లైసెన్స్ ఫీజులు నాలుగు శ్లాబులుగా అధికారులు నిర్ణయించారు. 10 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.65 లక్షలు, రూ.5 లక్షల ఆదాయం దాటిన నగరాల్లో గరిష్ట రుసుము రూ.85 లక్షలుగా నిర్ణయించారు. మొత్తం రుసుము ఆరు విడతలుగా చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.  


Similar News