అమలాపురం ఎంపీ అభ్యర్థి ఎవరు.. కొత్త ముఖం పరిచయం కాబోతుందా ?
ఎన్నికలు మరో ఏడాది ఉండగానే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
దిశ, అల్లవరం: ఎన్నికలు మరో ఏడాది ఉండగానే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటి నుంచే చాపకింద నీరులా పావులు కదుపుతూ గెలుపు కోసం ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
అమలాపురం ప్రత్యేక స్థానం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. అనేక మంది నాయకులు తమ మార్కు రాజకీయంతో ప్రజల మన్ననలు పొందారు. అలాంటి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం స్థానిక ప్రజలకు మరో కొత్త నాయకుని పరిచయం చేయబోతుందా? 2014 నాటి పరిస్థితులు మళ్లీ తెరపైకి రానున్నాయా అనే సందేహం కలుగుతుంది. 2014లో అప్పటి వరకు మొఖం తెలియని ఐఆర్ఎస్ ఉన్నతాధికారి పండుల రవీంద్రబాబు ఒక్కసారిగా తెరపైకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. అనంతరం 2019లో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ బాలయోగి పోటీ చేశారు. ఈయన ఎంపీ చింత అనురాధపై ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి నుంచి అధిష్టానం నిర్ణయం మేరకు హరీష్ బాలయోగి నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ప్రతిపక్ష నేతగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
మార్పు ఫలితాన్నిస్తుందా ?
ఇటీవల తెలుగుదేశం పార్టీ అధిష్టానం హరీష్ బాలయోగిని పీ గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. పీగన్నవరం నియోజకవర్గానికి పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన పులపర్తి నారాయణమూర్తి మృతి చెందటంతో అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థులు లేకుండాపోయారు. పీ గన్నవరంలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం లేక అంతంతమాత్రమే ఉంది. అయితే వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు జరగకపోవడంతోపాటు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, సరైన సత్సంబంధాలు కొనసాగించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గడపగడపకూ కార్యక్రమంతో పాటు పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే చిట్టిబాబుపై అక్కడి ప్రజలు బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో పీ గన్నవరంలో టీడీపీ నుంచి మంచి అభ్యర్థిని నిలిపితే గెలుపు తథ్యమని భావించి హరీష్ బాలయోగిని అక్కడకు పంపినట్లు తెలిసింది.
అమలాపురం పార్లమెంట్ పై ఆసక్తి?
ఇంత వరకు బాగానే ఉన్నా అమలాపురం పార్లమెంట్ బరిలో ఎవరు ఉంటారనే అనుమానాలు జోరుగా సాగుతున్నాయి. పీ గన్నవరం నియోజకవర్గంలో హరీష్ బాలయోగికి టికెట్ ఇస్తే అమలాపురం పార్లమెంట్ స్థానానికి ఎవరు పోటీ చేస్తారని చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల సమీపించే వరకు అభ్యర్థులు ఎవరనేది బయటకు తెలియనివ్వకుండా టీడీపీ అధిష్టానం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన మోక విద్యాసాగర్ అమలాపురం పార్లమెంట్ స్థానానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి మరో కొత్త అభ్యర్థి పరిచయమైనట్టే. అయితే ఇప్పటి వరకు అమలాపురం పార్లమెంట్ స్థానానికి హరీష్ బాలయోగి అభ్యర్థిగా భావిస్తున్న పార్టీ క్యాడర్ తాజా మార్పునకు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
Also Read...