ఏపీలో హస్తం దెబ్బ ఎవరికి తగులునో?

రాష్ట్రానికి సంబంధించి 5 లోక్​ సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది.

Update: 2024-04-03 02:44 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రానికి సంబంధించి 5 లోక్​ సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది. వామపక్షాలతో పొత్తు ఉంటుందని ఈపాటికే సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్​ పార్టీలు స్పష్టం చేశాయి. ఇండియా కూటమి పార్టీలకు సీట్లు పోను మిగతా స్థానాలను రెండో జాబితాలో వెల్లడించే అవకాశముంది. వైసీపీ నుంచి తిరిగి కాంగ్రెస్​ పార్టీలోకి వచ్చిన నేతలందరికీ టికెట్లు దక్కాయి. ప్రభుత్వాలు రద్దయి ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడ్డాక వైసీపీ నుంచి మరిన్ని వలసలు పెరగొచ్చని కాంగ్రెస్​ నేతలు భావిస్తున్నారు. వైసీపీలో సీటు దక్కని నేతలంతా క్యూ కట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

షర్మిల దూకుడు..

ఈ ఎన్నికల్లో ఎవరి విజయావకాశాలను కాంగ్రెస్​ దెబ్బతీస్తుందోననే అనుమానం ప్రధాన పక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన అంశాలపైనే ఎక్కువగా దృష్టి సారించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని తూర్పార బడుతున్నారు. వివేకా హత్య కేసును చర్చనీయాంశం చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పూర్తికాని పోలవరం ప్రాజెక్టుపై అధికార విపక్షాలను దునుమాడుతున్నారు. వీటిల్లో ఏఏ అంశాలు ఏమేరకు ఓటర్లను ప్రభావితం చేస్తాయి.. ఇవన్నీ అధికార వైసీపీని బలహీన పరుస్తాయా.. లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తాయా అనేది ప్రధాన పార్టీల ఊహకందడం లేదు.

తాయిలాలు పంచితే గెలుస్తారా?

ఆర్థికంగా వైసీపీ, టీడీపీ కూటమి అభ్యర్థులతో కాంగ్రెస్​ పోటీ పడుతుందా లేదా అనే కూడా చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో, హామీల వరకూ సగటు ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. దీటైన ప్రచారం, ఇతర వ్యయాన్ని ఏమేరకు కాంగ్రెస్​ అభ్యర్థులు భరిస్తారనే దాన్ని బట్టి కనీసం కొన్ని స్థానాలనైనా గెల్చుకునే అవకాశముంది. కేవలం ఓటర్లకు తాయిలాలు పంచినంత మాత్రాన గెలుపోటములు ఉండవని అనేక ఎన్నికలు నిరూపించాయి. ఈ దఫా ప్రజలు మార్పును కోరుకుంటారా.. లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు గడవాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News