AP News:వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్టూడెంట్ కిట్లు.. మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఈ ఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరంలో రూ. 85.84 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది
దిశ, నూజివీడు: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఈ ఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరంలో రూ. 85.84 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది అని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు. నూజివీడులోని ముడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి కొలుసు పార్ధసారధి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి పరుస్తుందన్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, ఫలితాలు మెరుగుదలకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. భోదనా విధానాన్ని మెరుగుపర్చేందుకు జిల్లా, రీజనల్ స్థాయిలో అకడమిక్, గైడెన్స్ అండ్ మోనిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేశారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఎంసెట్, నీట్ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు, పుస్తకాలు, ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను విద్యార్ధులకు అందజేయనున్నట్లు రాష్ట్ర మంత్రి పార్థసారథి తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయబోతున్నామన్నారు. కార్యక్రమంలో డివిఇవో బి. ప్రభాకరరావు, కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.