ఎన్నికలు ఎప్పుడైనా పోటీకి సిద్ధం : YS Jagan Mohan Reddy
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 49 అంశాలపై కేబినెట్ చర్చించింది. అనంతరం తాజా రాజకీయ పరిణామాలు, విశాఖ పరిపాలన కేంద్రం తదితర అంశాలపై మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలు అంశంపై చర్చించారు. ముందస్తు ఎన్నికలైనా జమిలి ఎన్నికలైనా దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ముందస్తు, జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయమే ఫైనల్ అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీని ధీటుగా ఎదుర్కోవాలని సీఎం జగన్ సూచించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ సభలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో టీడీపీ ప్రస్తావించే ప్రతీ అంశానికి ధీటుగా సమాధానం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ మంత్రులకు సూచించారు.