వరద బాధితుల చెంప చెళ్ళుమనిపించిన వీఆర్వో
విజయవాడ వరద బాధితులకు ఊహించని షాక్ ఎదురైంది.
దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ వరద బాధితులకు ఊహించని షాక్ ఎదురైంది. నగరంలోని అజిత్ సింగ్ నగర్లో వరద బాధితుల చెంప చెళ్లుమనిపించింది ఓ వీఆర్వో. సింగ్ నగర్లోని షాదీఖాన రోడ్డులో బాధితులకు ఆహారం, నీళ్ళు ఇవ్వడం లేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఈ విషయం గురించి విచారించేందుకు వచ్చిన వీఆర్వో విజయలక్ష్మిని.. ఆహారం, నీళ్ళు ఇవ్వడం లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నాం, చిన్న పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ బాధితులు వీఆర్వోను నిలదీశారు. కొద్దిసేపు బాధితులు, వీఆర్వోకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, సహనం కోల్పోయిన వీఆర్వో విజయలక్ష్మి ఓ బాధితుని చెంప పగలగొట్టింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. పోలీసులు వీఆర్వోను అక్కడి నుండి పంపించి వేశారు. వీఆర్వో పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరద బాధితులు ధర్నాకు దిగారు.