Visakha: జగన్ ఒక నిజం.. చంద్రబాబు ఓ అబద్ధం: ఉత్తరాంధ్ర వైసీపీ లీడర్లు
జగన్ ఒక నిజమని, చంద్రబాబు ఓ అబద్ధమని, రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్ముకుంటే, జగన్ తనను నమ్మిన వాళ్లకు ఇచ్చారని వైసీపీ నేతలు అన్నారు. ...
దిశ, ఏపీ బ్యూరో: జగన్ ఒక నిజమని, చంద్రబాబు ఓ అబద్ధమని, రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్ముకుంటే, జగన్ తనను నమ్మిన వాళ్లకు ఇచ్చారని వైసీపీ నేతలు అన్నారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర బుధవారం విశాఖ లో సాగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని డాబా గార్డెన్స్, జగదాంబ, పూర్ణ మార్కెట్ మీదుగా టౌన్ కొత్త రోడ్డుకు జనసందోహం మధ్య బైక్ ర్యాలీ సాగింది. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్ బహిరంగ సభకు హాజరయ్యారు. సామాజిక సాధికరత అనే మాట చెప్పడానికి జగన్‌కు తప్ప దేశంలో మరే నేతకు అర్హత లేదన్నారు. మోసానికి ఒక రూపం, అబద్ధానికి ఒక రూపం చంద్రబాబు అని విమర్శించారు. అమ్మఒడి అనే ఔషధం వేసి బాల కార్మిక వ్యవస్థను రూపు మాపిన స్ఫూర్తిదాయక నేత జగన్ అన్నారు.
జగన్ గెలుపు ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభం
గత పాలకుల హయాంలో విద్య ఎంత దయనీయ పరిస్థితిలో ఉండేదో గుర్తు తెచ్చుకోవాలన్నారు. పిల్లలకి నాణ్యమైన విద్య అందిస్తూ తల్లి ముఖంలో కనిపించే ఆనందం అభివృద్ధి ఎందుకు కాదో చెప్పాలని ప్రశ్నించారు. వీధిలో కాలువ, రోడ్డు, బిల్డింగ్ కడితేనే అభివృద్ధా ? అని ప్రశ్నించారు. ప్రజల డబ్బును చంద్రబాబు తమ ఖాతాల్లో వేసుకోన్నారని, జగన్ బడుగు, బలహీన వర్గాల చేయూతనిచ్చారని తెలిపారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవమే ఈ సామాజిక సాధికార యాత్రన్నారు.