సింహాద్రిలోకి అదానీ బొగ్గు.. అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది ?

రాష్ట్రం, కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్ల కాంట్రాక్టులను కొల్లగొట్టే వ్యూహ రచన చేశారు. ఈ వ్యవహారంలో మిగతా అన్నిచోట్ల మాదిరిగానే పాలకులు ఎలాగైతే అదానీకి సాగిలపడ్డారో అనకాపల్లి పార్లమెంట్‌ ప్రాంతంలోగల ‘కూటమి’కి చెందిన 2024 ఎన్నికల్లో గెలిచిన ఓ ప్రజాప్రతినిధి... అదానీ అడుగులకు మడుగులొత్తి ఎన్‌టిపిసి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి మరీ పాత కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేయించే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

Update: 2024-11-29 02:20 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణంలో ఇరుక్కున్న అదానీ సంస్థ తాజాగా అనకాపల్లి జిల్లా పరవాడ ఎన్టీపీసీలోకి ప్రవేశించనున్నారా? ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను లోబర్చుకుని దేశ, విదేశాల్లో అనేక ఆర్థిక లూటీలకు పాల్పడిన గౌతమ్‌ అదానీ తాజాగా పరవాడ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టిపిసి) పవర్‌ ప్రాజెక్టులోకి అడ్డగోలు ప్రవేశానికి సిద్ధమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సదరు సంస్థ టెండరు పిలవలేదు, బొగ్గు సరఫరాకు కొత్త కాంట్రాక్టర్లు కావాలని ఎక్కడా ప్రకటనా ఇవ్వలేదు. కానీ, అదానీ ఇక్కడకు ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు.

కోట్లు కొల్లగొట్టే వ్యూహం..

రాష్ట్రం, కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్ల కాంట్రాక్టులను కొల్లగొట్టే వ్యూహ రచన చేశారు. ఈ వ్యవహారంలో మిగతా అన్నిచోట్ల మాదిరిగానే పాలకులు ఎలాగైతే అదానీకి సాగిలపడ్డారో అనకాపల్లి పార్లమెంట్‌ ప్రాంతంలోగల ‘కూటమి’కి చెందిన 2024 ఎన్నికల్లో గెలిచిన ఓ ప్రజాప్రతినిధి... అదానీ అడుగులకు మడుగులొత్తి ఎన్‌టిపిసి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి మరీ పాత కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేయించే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించి అదానీ, అదానీ గ్రూపునకు చెందిన వ్యక్తులు దేశంలోని అధికారులకు ముడుపులు ముట్టజెప్పారని అమెరికా కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను సంచలనం రేకెత్తిస్తున్న తరుణంలోనూ పరవాడ ఎన్‌టిపిసిలో అడ్డగోలుగా అడుగు మోపి ఇది వరకు బొగ్గు సరఫరా చేసిన కాంట్రాక్టర్లను వెనక్కి నెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో కూటమి (బిజెపి సహా) అధికారంలో ఉండడం, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడంతో బొగ్గును ఇప్పటివరకూ ఎన్‌టిపిసికి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఎన్‌టిపిసికి ఎన్ని వర్క్‌ ఆర్డర్లయితే ఉన్నాయో వాటన్నిటినీ అనకాపల్లి ప్రాంత ‘కూటమి’ ప్రజాప్రతినిధి ద్వారా రద్దు చేయించినట్లు తాజాగా పరవాడ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

అదానీ బొగ్గు రాబోతుందంటూ..

పరవాడ ఎన్‌టిపిసికి అదానీ బొగ్గు రాబోతుందంటూ పెద్ద ఎత్తున ఇక్కడ కాంట్రాక్టర్లు, ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. నాలుగు రోజుల క్రితం పరవాడ ఎన్‌టిపిసికి ఉత్తరాదికి చెందిన కొందరు వచ్చి తాము అదానీ మనుషులమని ఎన్‌టిపిసికి అదానీ బొగ్గు రాబోతోందని అడిగిన వారికీ, అడగని వారందరికీ హిందీలో చెబుతూ తమకు నివాస భవనాలు కావాలంటూ ఎన్‌టిపిసి ప్లాంట్‌ చుట్టూ తిరిగారు. అదానీ బొగ్గు ప్రత్యేకమైనదని, ఎన్‌టిపిసికి ఇప్పుడు వచ్చే కోల్‌ కంటే నాణ్యమైనందని వీరు చెప్పినట్లు ఈ ప్రాంతానికి చెందిన పలువురు విలేకరులకు తెలిపారు. కొద్దిమంది కాంట్రాక్టర్లను సైతం అదానీ మనుషులు ఈ సందర్భంగా కలవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో పడ్డారు.

దేశంలో 2 ప్రాంతాల నుంచి ఎన్‌టిపిసికి బొగ్గు..

బొగ్గును మండించడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సంస్థల్లో దేశంలో పరవాడలోని ఎన్‌టిపిసి (సింహాద్రి) ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. రోజుకు 2000 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ఇక్కడ ఉత్పత్తి జరుగుతోంది. దేశంలోని తాల్చేరు, సింగరేణి నుంచి రైలు వ్యాగన్లలో రోజుకు రెండుసార్లు బొగ్గు వస్తోంది. అదానీకి బొగ్గు కాంట్రాక్టు దక్కితే ప్రభుత్వ రంగ సంస్థకు బొగ్గు సరఫరాలో గుత్తాధిపత్యంతో ఎన్‌టిపిసినే మింగేస్తాడంటూ పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి..

రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపుతూ అదానీకి భారీగా లబ్ధి చేకూర్చే సెకీ ఒప్పందాన్ని ఎటువంటి మొహమాటం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ అధికారులను మేనేజ్ చేసి ఆదానీ దారుణమైన ఒప్పందంపై అప్పటి వైసిపి ప్రభుత్వ పెద్దలతో సంతకాలు చేయించారని ఆయన ఆరోపించారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేసి అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు.

Tags:    

Similar News