వకీల్ సాబ్! ప్రజా కోర్టులు అంటే సినిమాల్లో కోర్టు కాదు: పవన్ కల్యాణ్‌కు వైసీపీ కౌంటర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పయనిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు.

Update: 2023-08-16 10:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పయనిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. చంద్రబాబు ఏది చెప్తే అదే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజాకోర్టులు అంటే సినిమాల్లో కోర్టులు కాదు అని పవన్ కల్యాణ్‌పై విమర్శలు కురిపించారు. రీమేక్‌ వకీల్‌సాబ్‌ సినిమాలో మీరు వకీలుగా కోర్టులో నటించినట్టు కాదంటూ ఎద్దేవా చేశారు. మీరు.. మీ జనసేన నాయకుల అకృత్యాల గురించి ప్రజాకోర్టులో విచారిస్తారా? అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణపై చర్చిస్తారా అని నిలదీశారు. అంతేకాదు మాజీమంత్రి పొంగూరు నారాయణపై ఆయన మరదలు కృష్ణప్రియ చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకుంటారా? అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. వైసీపీ ఎన్నికలు అనే ప్రజాక్షేత్రంలో సిద్ధంగా ఉన్నాం అని వరుదు కల్యాణి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో పవన్ కల్యాణ్ చెప్పగలరా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ వీర మహిళా విభాగం పేరులో వీరత్వం ఉంది కానీ, మహిళల రక్షణ విషయంలో లేదు అని ధ్వజమెత్తారు. అసలు పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి ఎప్పుడైనా మహిళల అభివృద్ధి గురించి సమావేశం ఏర్పాటు చేశారా? అని నిలదీశారు. ఇంట్లో మహిళలకు ఎంతగా భద్రత ఇవ్వాలో.. అంతకన్నా ఎక్కువ భద్రత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఇస్తున్నారని వరుదు కల్యాణి చెప్పుకొచ్చారు.


Similar News