Cyclone Fengal: ఏపీపై సైక్లోన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
తుపాను ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉండనుంది. ఇటు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది.
దిశ, వెబ్ డెస్క్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఏపీలో 3 జిల్లాలపై ప్రభావం చూపుతోంది. బాపట్ల జిల్లా (Bapatla District)లో తుపాను కారణంగా జోరు వానలు కురుస్తున్నాయి. రేపల్లె(Repalle)లో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరపి లేని వర్షం కురవగా.. కోతకు వచ్చిన వరిపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు.
గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను.. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, ట్రింకోమలీకి ఉత్తర ఈశాన్యంగా 130 కిలోమీటర్లు, నాగపట్నంకు తూర్పుగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుపాను వాయువ్య దిశగా కదులుతూ.. మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరిల వద్ద కారైకాల్ - మహాబలిపురం మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది.
తుపాను ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉండనుంది. ఇటు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కడప, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.