జగన్ పాలనలో అన్ని రంగాలు అధో:పాతాళంలోకి...ఓటుతో వైసీపీని తరిమికొట్టండి: గంటా శ్రీనివాస్
మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు మరింత యాక్టివ్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు మరింత యాక్టివ్ అయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభం నుంచి గంటా శ్రీనివాసరావు దూకుడు పెంచారు. రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్న గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. అటు వైసీపీలో చేరతారని కొంతమంది కాదు కాదు జనసేనలో చేరతారని మరికొందరు తెగ ప్రచారం చేశారు. యువగళం పాదయాత్రకు ముందు నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. అప్పటి నుంచి అటు సోషల్ మీడియా ప్లాట్ ఫాం.. ఇటు మీడియా సాక్షిగా వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నిత్యం ఏదో ఒక అంశంపై ట్విటర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని కడిగిపారేస్తున్నారు మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు. తాజాగా రాష్ట్రంలో నిరుద్యోగిత రేటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను నెం.1లో నిలుపుతాను అని సీఎం వైఎస్ జగన్ పదేపదే చెప్పుకొచ్చారని...ఏపీని నిరుద్యోగంలో నెంబర్ వన్ స్థానంలో నిలుపుతారని తాను గ్రహించలేకపోయాను జగనన్నా అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.
చరమగీతం పాడండి
దేశ చరిత్రలో ఎన్నడూ లేనవిధంగా బీహార్‌ను కూడా వెనక్కి నెట్టేసి మరీ పట్టభద్రులను నిరుద్యోగంలో 24%తో మొదటి స్థానంలో నిలిపిన ఘనత జగన్‌కే దక్కుతుందని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. జాతీయ సరాసరినే 13.4 శాతంగా ఉంటే జాతీయ సరాసరి కన్నా 11 శాతం అధికంగా రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్‌ను నిరుద్యోగంలోకి నెట్టేశారని చెప్పుకొచ్చారు. జాతీయ సగటు కంటే నిరుద్యోగంలో 12 రాష్ట్రాలు పైన ఉంటే వాటిల్లో ఏపీనే అగ్రస్థానంలో నిలిపారని సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. కేవలం కక్షలు కార్పణ్యాలపైన దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అట్టడుగుకు నెట్టేశారని గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఒక్క నిరుద్యోగంలోనే కాదు అన్ని రంగాలలో అధో:పాతాళంలోకి నెట్టేశారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు. 2024లో చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్‌తో రాష్ట్రానికి పూర్వ వైభవం రావడం తథ్యం.. నిరుద్యోగులకు మంచి జరుగుతుదని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. యువత ఓటు అనే ఆయుధంతో ఈ అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడి...రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విటర్ వేదికగా ప్రజలను విజ్ఞప్తి చేశారు.