TTD News : భారీ వర్షాల కారణంగా టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో టీటీడీ(TTD) ఆధ్వర్యంలో ప్రతిఏటా కార్తీకమాసంలో వనభోజన (Karthika Vanabhojanam) కార్యక్రమం నిర్వహిస్తారు.
దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో టీటీడీ(TTD) ఆధ్వర్యంలో ప్రతిఏటా కార్తీకమాసంలో వనభోజన (Karthika Vanabhojanam) కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా నవంబర్ 17న కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఆదివారం తిరుమలలో భారీ వర్షం కురవొచ్చన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో వనభోజనాల వేదికను మార్చింది టీటీడీ. సాధారణంగా పార్వేట మండపంలో తిరుమల కార్తీక వనభోజన మహాత్సవం నిర్వహిస్తారు. అందుకు తగినట్లుగానే ఈసారి కూడా పార్వేట మండపంలోఈ మహోత్సవం నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో పార్వేట మండపంలో కాకుండా వైభవోత్సవ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కార్తీక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీవారి ఉత్సవమూర్తులను వైభవోత్సవ మండపానికి తీసుకువస్తారు. ఉదయం 11 నుంచి 12 వరకూ మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. మరోవైపు తిరుమలలో కార్తీక వన భోజన మహోత్సవం సందర్భంగా టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది.