Andhra Pradesh News : జగ్గంపేట వైసీపీలో టికెట్ వార్: జ్యోతుల వర్సెస్ తోట

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంటుంది.

Update: 2023-07-18 10:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంటుంది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పంచాయతీ తాడేపల్లికి చేరిన సంగతి తెలిసిందే. ఈ పంచాయితీ తెగకముందే మరో నియోజకవర్గంలో పంచాయతీ రచ్చకెక్కింది. కాకినాడ జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట టికెట్‌పై ఈ పంచాయతీ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో కూడా తనదే టికెట్ అని సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు భావిస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అని మాజీ మంత్రి తోట నరసింహం ధీమాగా ఉన్నారు. ఈ టికెట్ రేసు మెుదలవ్వడంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవి కాస్తా ఇప్పుడు ఏకంగా ఆత్మీయ సమ్మేళనాల వరకు వెళ్లాయి. దీంతో జగ్గంపేట నియోజకవర్గం వైసీపీలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానిక వైసీపీ నేతల్లో నెలకొంది.

టికెట్ రేసులో నువ్వా నేనా?

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి పోరు తారా స్థాయికి చేరింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలో టికెట్ కోసం వైసీపీలో పోటాపోటీ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు భావిస్తున్నారు. తోట నరసింహం 2019 ఎన్నికల అనంతరం మౌనం వహించారు. దీంతో ఇక ఆయన రాజకీయాల్లోకి మళ్లీ రారు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా మళ్లీ తెరపైకి వచ్చారు. తన వర్గానికి చెందిన వ్యక్తులతో కలిసి రాజకీయం చేస్తున్నారు. ఇది స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు మింగుడుపడటం లేదు. మరోవైపు ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని మాజీమంత్రి తోట నరసింహం ధీమాగా ఉన్నారు. తన సీనియారిటీ, సిన్సియారిటీ కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇలా టికెట్ కోసం ఇరువురు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దీంతో జగ్గంపేట వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. నువ్వా నేనా అన్న రీతిలో అటు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇటు మాజీమంత్రి తోట నరసింహం పోటీపడుతున్నారు.

సమ్మేళనంలో మాటల తూటాలు

మాజీమంత్రి తోట నరసింహం దూకుడు పెంచుతుండటంతో అటు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సైతం అప్రమత్తమయ్యారు. తన వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని సైతం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో మాజీమంత్రి తోట నరసింహంపై అవినీతి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆరోపణలకు మాజీమంత్రి తోట నరసింహం కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తూ మరి కౌంటర్ ఇస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి తాను రెండు దఫాలుగా గెలుపొందానని తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. అలాంటి తనపై ఎమ్మెల్యే చంటిబాబు అవినీతి మరకలు అంటించడం సరికాదంటున్నారు. అన్యాయంగా తనపై విమర్శలు చేస్తే అందుకు ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీమంత్రి తోట నరసింహం హెచ్చరించారు.

అధిష్టానందే తుది నిర్ణయం

ఇకపోతే రాజకీయాల్లో తోట నరసింహం సీనియర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే వైఎస్ఆర్ మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు తోట నరసింహం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే తోట నరసింహం సతీమణి వాణి పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి అటు వాణి, ఇటు తోట నరసింహం రాజకీయాల్లో స్తబ్ధుగా ఉన్నారు. తోట నరసింహం అనారోగ్యానికి పాలవ్వడంతో ఆయన తనయుడు రాంజీని రాజకీయ వారసుడిగా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో రాంజీ వైసీపీ అభ్యర్థిగా జగ్గంపేట నుంచి పోటీ చేస్తారని లీకులు ఇచ్చారు. అయితే ఇటీవల రాంజీ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తన తండ్రి పోటీ చేస్తారని రాంజీ ప్రకటించారు. మరోవైపు తండ్రికే టికెట్ వస్తుందని ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మెుత్తానికి ఈ జగ్గంపేట నియోజకవర్గం టికెట్ ఎవరిని వరిస్తుందో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News