ఆ జిల్లాలో భారీ వర్షం..నీట మునిగిన వేలాది ఎకరాల పంట పొలాలు

పల్నాడు జిల్లా భారీ వర్షానికి తడిసి ముద్దయింది. రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది.

Update: 2024-08-31 15:23 GMT

దిశ, పల్నాడు:పల్నాడు జిల్లా భారీ వర్షానికి తడిసి ముద్దయింది. రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ప్రజల రోజువారీ దినచర్య ఆగిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం శనివారానికి తీవ్ర రూపం దాల్చడంతో పాఠశాలలకు కలెక్టర్ అరుణ్ సెలవు ప్రకటించారు. వర్షపు నీటి ఉధృతికి పలు ప్రాంతాల్లోని లో లెవెల్ చప్టాలు ఉప్పోంగి ప్రవహించాయి. దీంతో ఆయా మార్గాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. మధ్యాహ్నం నుంచి వర్షానికి ఈదురు గాలులు తోడవటంతో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడం పేదల కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సత్తెనపల్లి పెదకూరపాడు నరసరావుపేట గురజాలలో స్థానిక శాసనసభ్యులు ఆదేశాలతో అధికారి సహాయ చర్యలు చేపట్టారు. నీట మునిగిన కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.

నదిలా ప్రవహిస్తున్న వాగులు..

భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద లో లెవెల్ వాగుపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో గుంటూరు -హైదరాబాద్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అచ్చంపేట మాదిపాడు మార్గంలో చప్టా పై ప్రమాదకరం వర్షపు నీరు ఉప్పోంగి ప్రవహించడంతో ఈ మార్గం రాకపోకలు స్తంభించాయి. నందిగామ వద్ద లో లెవెల్ వంతెనపై నీరు ప్రవహించడంతో సత్తెనపల్లి అమరావతి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

జలమయమైన లోతట్టు ప్రాంతాలు..

జిల్లాలో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. దాచేపల్లి మండలం రామాపురం భట్రుపాలెం పొందుగల తంగెడ. అచ్చంపేట మాదిపాడు బెల్లంకొండ సత్తెనపల్లి మండలంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాధితులను అధికారులు సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. మత్స్యకారుల వేట నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. నీట మునిగిన పంటలు వర్షపు నీటి ఉధృతికి జిల్లాలోని అనేక మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వాగులు చెరువులు సమీప పొలాల్లో అయితే అడుగు మేర వర్షపు నీరు ప్రవహిస్తోంది. పత్తి పంట పిందె దశలో ఉండగా కురుస్తున్న అకాల వర్షంతో తమకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు.


Similar News