బెల్ట్ షాపు @ రూ.లక్ష..! గ్రామాల్లో తీవ్ర పోటీ

నూతన మద్యం పాలసీ నేపథ్యంలో గ్రామాల్లో బెల్టు దుకాణాలకు భలే గిరాకి ఉంది.

Update: 2024-10-28 03:21 GMT

దిశ ప్రతినిధి, కర్నూలు: నూతన మద్యం పాలసీ నేపథ్యంలో గ్రామాల్లో బెల్టు దుకాణాలకు భలే గిరాకి ఉంది. నాటు సారా విక్రేతలు, బెల్టు దుకాణదారులకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. లాటరీ పద్ధతిలో దుకాణాలు దక్కించుకున్న వారు గ్రామాల్లో బెల్టు దుకాణాలు పెట్టుకునేందుకు బేరాలాడుతున్నారు. రూ.లక్ష ఇస్తేనే బెల్టు దుకాణానికి అవకాశం కల్పిస్తున్నారు. అదే సమయంలో నాటు సారా విక్రేతలు బెల్టు షాపులకు పోటీ పడుతున్నారు. వీరే కాకుండా సర్పంచులు, మాజీ సర్పంచులు కూడా పోటీలో ఉండడం గమనార్హం. అయితే మద్యం దుకాణదారులు బెల్టు షాపు పెట్టుకుంటే నాటుసారా అమ్మకాలు చేయరాదని మెలిక పెడుతున్నారు. దీంతో చాలా మంది రెండూ అమ్ముకుంటామని చెబుతున్నారు. ఇలా గ్రామాల్లో నెలకొన్న పోటీ తత్వం పోలీసులు, ఎక్సైజ్ పోలీసులకు కాసుల పంట కురిపించనుంది.

ఉత్సాహం చూపిస్తున్న సర్పంచ్‌లు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 204 ప్రయివేట్ మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా కేటాయింపులు చేశారు. కర్నూలు జిల్లా పరిధిలో 99 మద్యం దుకాణాలు, నంద్యాల జిల్లా పరిధిలో 105 మద్యం దుకాణాలున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో కర్నూలులో 31, కోడుమూరులో 14, ఎమ్మిగనూరులో 15, ఆదోనిలో 12, కోసిగిలో 4, ఆలూరులో 9, పత్తికొండలో 14, నంద్యాలలో 24, ఆళ్లగడ్డలో 19, ఆత్మకూరులో 13, డోన్ లో 16, బనగానపల్లెలో 12, కొవెలకుంట్లలో 11, నందికొట్కూరులో 10, సున్నిపెంటలో 2, పాణ్యం రూరల్ పరిధిలో 11, మంత్రాలయంలో 8, మద్యం దుకాణాలున్నాయి.

దుకాణాలు దక్కించుకున్న వారంతా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీటి పరిధిలో ఉండే గ్రామాల్లో బెల్టు దుకాణాల ఏర్పాటు కోసం పోటా పోటీ నెలకొంది. ఒక్కో గ్రామంలో బెల్టు దుకాణం పెట్టుకునేందుకు దాదాపు లక్ష రూపాయలు చెల్లించి మరీ అమ్మకాలు చేస్తున్నారు. ప్రత్యేకించి సర్పంచులు, మాజీ సర్పంచులు కూడా బెల్టు షాపుల నిర్వహణ కోసం పోటీ పడడం విశేషం. ప్రత్యేకించి నందికొట్కూరు నియోజకవర్గంలో సర్పంచులు, మాజీ సర్పంచులు పోటీ పడుతున్నట్లు సమాచారం.

పోలీసులకు కాసుల వర్షం

గ్రామాల్లో బెల్టు షాపుల నిర్వహణ కోసం నెలకొన్న తీవ్ర పోటీ అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిద్ధాపురం, చెంచు గూడేలు, నల్లమల అటవీ ప్రాంతాలు, ఆదోని, నందికొట్కూరు, కొత్తపల్లి, పాములపాడు, ఆత్మకూరు, వెలుగోడు, ఆలూరుతో పాటు తెలంగాణ, కర్నాటక రాష్ర్టాలకు సమీప ప్రాంతాల నుంచి నాటు సారా జిల్లా వ్యాప్తంగా సరఫరా అవుతోంది. ఒక్కో బిందె సారాను తయారీ దారులు రూ.4,500లకు విక్రయిస్తారు. ఇలా వారంలో ఒక్కో వ్యాపారీ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం గడిస్తు్న్నారు.

ఇలా ప్రతి నెలా వ్యాపారులు రూ.80 వేల నుంచి లక్ష వరకు సంపాదిస్తు్న్నారు. నెలకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు మామూళ్లిస్తూ వచ్చారు. అంటే లక్షలో అధికారులకు దాదాపు రూ.50 వేల వరకు ముడుపులు చెల్లించగా అదనంగా రూ.50 నుంచి రూ.60 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఇలా పలు స్టేషన్లకు చెందిన పోలీసులు, ఎస్ఐలు ముడుపులు తీసుకుని వారి వ్యాపారాలకు వెన్నుదన్నుగా నిలిచారు. అయితే ప్రస్తుతం మద్యం దుకాణాలు, బెల్టు షాపుల నిర్వహణతో వీరికి రెట్టింపు ఆదాయం వస్తుందనే చర్చలు జోరందుకున్నాయి.


Similar News