Pawan Kalyan: పాలనలో పవన్ ముద్ర.. సొంత నిధులతో బాధితులకు బాసట
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్రెండ్ సృష్టించిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర పరిపాలనలో సైతం తనదైన ముద్రను వేసుకుంటున్నారు.
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్రెండ్ సృష్టించిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర పరిపాలనలో సైతం తనదైన ముద్రను వేసుకుంటున్నారు. ప్రభుత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తక్షణమే స్పందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తనకు కేటాయించిన ఐదు శాఖలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు తగిన విధంగా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడుకు విషయాన్ని తెలియజేయడంలో ప్రభుత్వం పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందుగానే అవగాహనతో ముందుకు సాగుతున్నారు.
కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారం..
కూటమి ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో తన మార్క్ సైతం ఉండేలా సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ప్రభుత్వం సైతం పవన్ కళ్యాణ్ సలహాలను, సూచనలను తూ.చ తప్పకుండా అమలు చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటు సీఎంతో పాటు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అధికారులు పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తున్నారు.
సొంత నిధులతో బాధితులకు బాసట
తన దృష్టికి వచ్చిన ఎటువంటి సమస్యనైనా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు తన సొంత నిధులను ఇస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు కేటాయించడంలో ముందంజలో ఉన్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి అయినా సరే ప్రభుత్వానికి ఎటువంటి భారం కలుగకుండా సొంత నిధులను మంజూరు చేస్తూ తనశైలిని కొనసాగిస్తున్నారు.
నాకు నువ్వు.. నీకు నేను
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో స్నేహపూర్వక వాతావరణం సృష్టించడంలో సఫలీకృతం అయ్యారని చెప్పవచ్చు. నాకు నువ్వు... నీకు నేను...అన్నట్లు పరిపాలన విషయంలో ఇద్దరు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ వాతావరణం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కిందిస్థాయి క్యాడర్ సైతం కలిసిమెలిసి కార్యక్రమాలు చేసేలా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
నామినేటెడ్ పదవులు దక్కించుకోవడంలోనూ సక్సెస్
నామినేటెడ్ పదవుల్లో సైతం కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన తనకున్న ఓటు బ్యాంకు అనుగుణంగా పదవులు దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. ఎమ్మెల్సీతో పాటు మొదటి విడత నామినేటెడ్ పదవుల్లో మూడు చైర్మన్ పోస్ట్ లను దక్కించుకోవడంలో విజయం సాధించిందని చెప్పాలి. రెండో విడత నామినేటెడ్ పోస్టుల్లో సైతం చైర్మన్ స్థానాలను జనసేన కైవసం చేసుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.