కోర్టు కానిస్టేబుల్ మాస్టర్ గేమ్! రౌడీషీట్ ఎత్తివేతకు పక్కా ప్లాన్

వాళ్లిద్దరి పేర్లు ఒకటే. అయితే ఒకరు రాజకీయ నేత.. మరొకరు రౌడీ షీటర్.

Update: 2024-10-28 03:15 GMT

దిశ, ప్రతినిధి గుంటూరు: వాళ్లిద్దరి పేర్లు ఒకటే. అయితే ఒకరు రాజకీయ నేత.. మరొకరు రౌడీ షీటర్. ఇద్దరిది ఒకే నగరం. కాగా, రాజకీయ నేత అనారోగ్య కారణాలతో మృతి చెందడం, ఆ రౌడీషీటర్‌కు కలిసొచ్చింది. ఆయన డెత్ సర్టిఫికేట్ ఉపయోగించుకొని రౌడీ షీట్ ఎత్తి వేయించుకున్నాడు. ఇందుకు పథక రచన చేసింది ఓ కోర్టు కానిస్టేబుల్. అయితే, ఈ మోసం ఎక్కువ కాలం దాగలేదు. కొద్దీ రోజులకే బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. పాదర్తి రమేశ్ గాంధీ.. గుంటూరు నగరవాసులకు సుపరిచిత పేరు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. వైసీపీలో కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ అయ్యేందుకు పోటీపడగా, పార్టీ పెద్దలు రెండున్నర సంవత్సరాలు పదవి ఇచ్చేందుకు అంగీకరించారు. కాగా, కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారు.

ప్లాన్ అమలు చేసిందిలా..

పాదర్తి రమేశ్ చనిపోయిన తరువాత కోర్టు కానిస్టేబుల్ రంగంలోకి దిగారు. పోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అదే పేరున్న వ్యక్తిపై రౌడీ షీట్ ఎత్తివేయించాడు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పాదర్తి రమేశ్ అనే మరో వ్యక్తిపై పలు క్రిమినల్ కేసులున్నాయి. ఇతని స్వస్థలం పల్నాడులోని దాచేపల్లి మండలం గామాలపాడు. గుంటూరు నగరంలో కారసాని శ్రీను, నల్లపాటి శివయ్య అనే ఇద్దరూ రౌడీ షీటర్ల మధ్య గతంలో ముఠా తగాదాలుండేవి. ఈ క్రమంలోనే కారసాని శ్రీనును మల్లాది శివయ్య హత్య చేయించాడు.

ఈ కేసులో పాదర్తి రమేశ్ ప్రధాన నిందితుడు. ఆ తర్వాత శివయ్య, రమేశ్ మధ్య కూడా విబేధాలు వచ్చాయి. 2020లో రౌడీ షీటర్ పాదర్తి రమేశ్ కోరిక మేరకు అప్పటి గుంటూరు వెస్ట్ డీఎస్పీ కేసును దాచేపల్లికి బదిలీ చేశారు. ఆ తరువాత కోర్టు కానిస్టేబుల్ అతనితో కుమ్మక్కై చనిపోయిన కార్పొరేటర్ డెత్ సర్టిఫికేట్‌ను పోర్జరీ చేసి దాఖలు చేసి గుట్టుగా రౌడీ షీట్ తీయించడంలో సఫలమయ్యాడు. అదే సర్టిఫికెట్ ద్వారా రమేశ్ నిందితుడిగా ఉన్న కేసులలో కూడా పేరు తొలగించేలా చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా జరిగింది 2020 సంవత్సరంలో.

పోలీసు శాఖ అప్రమత్తం..

గుట్టుచప్పుకు కాకుండా జరిగిన ఈ తతంగం కొద్ది రోజుల క్రితం బయటకు పొక్కడంతో, పోలీస్ శాఖ అప్రమత్తమైంది. గత వారంలో గుంటూరు కోర్టులో ఒక వ్యక్తికి బదులు మరొకరు హాజరైన క్రమంలో జడ్జి ఈ విషయాన్ని పసిగట్టి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఘటన మరువక ముందే అటువంటి తరహాలో మరొక కేసు బయట పడటంతో కలకలం రేగింది. వీటిపై జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటారని సమాచారం.


Similar News