Thota Chandra Shekhar: పవన్‌కు కేసీఆర్ ఆఫర్ ఉత్తిదే

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి రూ.1000 కోట్లు ఆఫర్ చేశారంటూ వచ్చిన కథనాలపై బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఖండించారు. ..

Update: 2023-02-22 10:20 GMT
  • పార్టీలు, నేతల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయోద్దు
  • రాజకీయాల్లో పొత్తులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు
  • ఏపీకి ఇప్పటికీ రాజధాని లేకపోవడం ప్రజల దురదృష్టకరం
  • - తోట చంద్ర శేఖర్

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూ.1000 కోట్లు ఆఫర్ చేశారంటూ వచ్చిన కథనాలను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఖండించారు. ఇలాంటి దుష్ప్రచారం రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఉండవల్లి దేవుడి మాన్యంలో మహా మృత్యుంజయ విశ్వశాంతి మహాయాగం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తోట చంద్ర శేఖర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలను, నేతల వ్యక్తిత్వాలను అవహేళన చేసే అభియోగాలు మోపడం తగదని సూచించారు. పొత్తు కోసం కేసీఆర్ డబ్బు ఆఫర్ చేశారని అభియోగాలు మోపడం వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని మండిపడ్డారు. పొత్తు ఏ పార్టీతోనైనా పెట్టుకోవచ్చని, అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. తాము పొత్తు పెట్టుకుంటే సంసారమని, ఇతరులు పెట్టుకుంటే వ్యభిచారమని మాట్లాడడం సరికాదని తోట చంద్ర శేఖర్ సూచించారు.

అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తాం

బీఆర్ఎస్ పార్టీ త్వరలో అన్ని రాష్ట్రాలలో విస్తరిస్తుందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ తయారవుతుందన్నారు. రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకమైన ఫోకస్ పెడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగం, ధరల నియంత్రణ లేకపోవడం వంటి ప్రధాన అంశాలపై కేంద్రంతో పోరాడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విభజన హామీలను సాధించుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనలో వైసీపీ, టీడీపీ పార్టీలు విఫలం అయ్యాయని విమర్శించారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ఏపీకి రాజధాని లేకపోవడం ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్  ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News