AP Cabinet:ఏపీ మంత్రివర్గ సమావేశం..కేబినెట్​లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్​ సమావేశం ప్రారంభమైంది.

Update: 2024-08-28 07:13 GMT

దిశ, డైనమిక్​ బ్యూరో:సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్​ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేపర్ లెస్ విధానంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధానంలో కేబినెట్ నిర్వహించారు. ఇప్పటికే మంత్రులందరికీ ట్యాబ్‌లు అందజేసి వారికి శిక్షణ కూడా ఇచ్చారు.

కేబినెట్​లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

గత ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్​టెండరింగ్​ విధానాన్ని రద్దు చేస్తూ కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పునరుద్ధరణ కు ఆమోదం లభించింది. ఈ పనులకు ప్రస్తుతం చేస్తున్న కాంట్రాక్టర్​నే కొనసాగిస్తారు. అబ్కారీ శాఖ పునర్ ​వ్యవస్థీకరణ మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పెషల్​ ఎన్​ఫోర్స్ మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్ శాఖకు ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకువచ్చింది. అదేవిధంగా పట్టాదారు పాసు పుస్తకాల పై ఉన్న మాజీ సీఎం జగన్​ బొమ్మను, రాజకీయ లోగోలను కూడా తొలగించనున్నారు.

దీనిపై ఇక నుంచి రాజముద్రను ముద్రించి అందజేస్తారు. 21.86 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని వేస్తారు. అదేవిధంగా 77 లక్షల సర్వే రాళ్ల పై కూడా జగన్​ బొమ్మను తొలగించి వినియోగించుకునేందుకు కేబినెట్​ఆమోదం తెలిపింది. 22ఎ, ప్రీ హోల్డు భూముల వివాదంపై రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్​లను నిలిపివేతకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో కొత్తగా 2,774 రేషన్​ దుకాణాల ఏర్పాటు చేయనున్నారు. ఈ రేషన్​ దుకాణాల్లో ఈ పాస్​ మిషన్ల కొనుగోలుకు నిధులు కేటాయించనున్నారు. మున్సిపల్​ శాఖలో 269 సూపర్​ న్యూమరీ పోస్టులు భర్తీ చేపట్టనున్నారు. ఇంకా పలు అంశాలపై కేబినెట్​లో చర్చ కొనసాగుతోంది.


Similar News