పేదలకు సంక్షేమ పథకాలు అందడంలో ఎక్కడా ఆలస్యం జరగకూడదు
క్షేత్రస్థాయిలో ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ సేవలు మరింత వేగంగా అందాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ టి. ఎస్.చేతన్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : క్షేత్రస్థాయిలో ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ సేవలు మరింత వేగంగా అందాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ టి. ఎస్.చేతన్ అన్నారు.2016 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన సచివాలయ శాఖ డైరెక్టరుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్షేమ క్యాలెండరును అనుసరించి జనవరి లోపు అమలు కానున్న వివిధ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్ల సన్మాన కార్యక్రమం, దైవార్షిక సంక్షేమ పథకాల అమలు, ఈబీసి నేస్తం, జగనన్న బీమా వంటి పథకాల అమలు తీరును సమీక్షించారు. అర్హలై ఉండి ఇంకా ఎక్కడైనా, ఎవరికైనా పేదలు సంక్షేమ పథకాలు అందక ఇబ్బంది పడుతుంటే వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ముఖ్యంగా టెక్నికల్ అంశాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ భావన, వివిధ విభాగాల ఉన్నతస్థాయి అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.