మాదలలో చారిత్రక శిల్పాలకు ఆదరణ కరువు...
పల్నాడు జిల్లా, ముప్పాళ్ళ మండలం, మాదల గ్రామంలోని సకలేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో చారిత్రక శిల్పాలు, శాసనాలు కొయ్యరధాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా.ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.
దిశ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా, ముప్పాళ్ళ మండలం, మాదల గ్రామంలోని సకలేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో చారిత్రక శిల్పాలు, శాసనాలు కొయ్యరధాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా.ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. శ్రీనాథ సాహితీ పరిషత్ కార్యదర్శి, స్వర్ణచిన రామిరెడ్డి, మణిమేల శివశంకర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన శనివారం మాదల గ్రామంలోని చారిత్రక ఆనవాళ్లను పరిశీలించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గ్రామంలో సకలేశ్వరాలయ ప్రాంగణంలో గల క్రీ.శ. 1125 - 1523 సం|| ల మధ్య కాలానికి చెందిన 25 శాసనాలు స్థానిక పాలకులైన కొండపడుమటి, వెలనాటి, కాకతీయ, విజయనగర రాజులు విడుదల చేసిన శాసనాల్లో సకలేశ్వర, కోటేశ్వర, త్రిపురాంతక, సాగరేశ్వర దేవాలయాలు, ఏడు చెరువుల నిర్మాణం, ఆలయ నిర్వహది, జీర్ణోద్ధరణ, దీపారాధనకు కావాల్సిన నెయ్యి కోసం భూమిని గొర్రెలని దానం చేసిన వివరాలు ఉన్నాయని చెప్పారు.
అన్ని శాసనాల్లో గ్రామం పేరు మామండల అని ఉందని, ఒక క్రీ.శ. 1390 నాటి శాసనంలో మాత్రమే మాందల అని ఉందని, అదే క్రమంగా మాదలగా స్థిరపడిందని శివనాగిరెడ్డి అన్నారు.
సకలేశ్వర స్వామి దేవాలయంలో అపురూప శిల్పాలైన నాగదేవతలు, మహిషాసురమర్దిని, భైరవ, గణపతి, కుమారస్వామి, వీరులు, దంపతుల శిల్పాలు, చారిత్రక ప్రాధాన్యత గల శాసనాలు నిర్లక్ష్యానికి గురై నేలపై పడి ఉన్నాయని, వాటిని పీఠాలపై నిలబెట్టాలన్నారు.
పల్నాడు జిల్లాకే వన్నె తెచ్చేలా, అద్భుత శిల్పాలతో అలంకరించిన 400 సంవత్సరాల నాటి కొయ్యరధం శిధిలమైపోతుందని, నంది, గణపతి శిల్పాలకు వేసిన రంగుల వల్ల ప్రాచీనతకు భంగం కలిగిందని ఆయన వాపోయారు. ఇప్పటికైనా వాటిని భద్రపరిచి భవిష్యత్తు తరాలకు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మాదల గ్రామ ప్రజలకు, ఆలయ అధికారులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.