NRI Doctor Lokesh: NRIపై దాడి చేసిన సీఎం జగన్ భద్రతాసిబ్బంది.. వీడియో వైరల్

NRI డాక్టర్ లోకేష్‌పై ఏపీ సీఎం జగన్ భద్రతాసిబ్బంది దాడికి పాల్పడినట్టు సమాచారం.

Update: 2024-05-18 14:06 GMT

దిశ వెబ్ డెస్క్: NRI డాక్టర్ లోకేష్‌పై ఏపీ సీఎం జగన్ భద్రతాసిబ్బంది దాడికి పాల్పడినట్టు సమాచారం. తాజాగా ఈ ఘటనపే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ నేత దేవినేని ఉమ X వేదికగా స్పందించారు. వైసీపీ స్పాన్సర్డ్ రౌడీయిజం ఏపీలో ఇంకా కొన‌సాగ‌డం చాలా దుర‌దృష్టక‌రమని నారా లోకేష్ పేర్కొన్నారు. అలానే జగన్ అవినీతి, అరాచకాల‌ను ప్రశ్నించిన NRI డాక్టర్ లోకేష్ కుమార్‌ని గ‌న్నవ‌రం ఎయిర్ పోర్టులో జ‌గ‌న్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, దాడికి పాల్పడ‌టం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులం అని చెబుతూ అమెరికా పౌరుడైన డాక్టర్ లోకేష్ కుమార్‌ని అప‌హ‌రించిన జ‌గ‌న్ గూండాల‌పై, అమానుషంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అలానే ప్రముఖ వైద్యులు డాక్టర్ లోకేష్‌పై సీఎం భద్రతాసిబ్బంది దాడి చేయడాన్ని దేవినేని ఉమ తీవ్రంగా ఖండించారు. దాడి విషయం తెలుసుకున్న వెంటనే సీనియర్ లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ, మీడియా ఇన్ఛార్జ్ దారపనేని నరేంద్ర ఇతర నేతలతో కలిసి విజయవాడలోని ఎల్ఐసి కాలనీలోని డాక్టర్ లోకేష్ గారి స్వగృహానికి వెళ్లి వారిని పరామర్శించి జరిగిన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డాక్టర్ లోకేష్ గారిపై 20 మంది పోలీసులు దౌర్జన్యం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎయిర్ పోర్టులో డాక్టర్ లోకేష్ గారిని గుర్తు పట్టిన వైసీపీ నాయకులు సీఎం సెక్యూరిటీకి సమాచారం అందించారని ఆరోపించారు. అలానే ఒక సీనియర్ డాక్టర్, అమెరికా సిటిజెన్ ను మ్యాన్ హ్యాండిల్ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఏ రాజకీయ నాయకుడి డైరెక్షన్ లో సీఎం సెక్యూరిటీ అధికారులు ఈ పనిచేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అమెరికన్ సిటిజన్ అయినా మాతృభూమిపై ప్రేమతో ఇక్కడ జరుగుతున్న దోపిడీ, అరాచకాలపై సోషల్ మీడియాలో స్పందించినందుకే కక్ష కట్టారని పేర్కొన్నారు. పేరుపొందిన ప్రఖ్యాత వైద్యులు, ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిన వ్యక్తి డాక్టర్ లోకేష్ అని, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తూ కూడా చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయని మండిపడ్డారు.

ఎవరి ప్రోత్సాహం, ప్రోద్భలంతో ఈ పనులు జరిగాయి? అని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులైన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తప్పు చేసిన ఏ అధికారి తప్పించుకోలేడని హెచ్చరించారు. 

Click Here For Twitter Post..


Similar News