ఉచ్చు బిగుస్తోంది: మాజీమంత్రి నారాయణకు సీఐడీ మళ్లీ నోటీసులు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో ఇప్పుడు మాజీమంత్రి నారాయణ వంతు వచ్చింది.

Update: 2023-10-02 07:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో ఇప్పుడు మాజీమంత్రి నారాయణ వంతు వచ్చింది. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. అలాగే ఈకేసులో చంద్రబాబు నాయుడు విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి నారాయణను సీఐడీ టార్గెట్ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో నారాయణ ఏ2గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు మరోసారి మాజీమంత్రి నారాయణకు నోటీసులు అందజేశారు. వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏ-14గా సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేశ్‌కు సీఐడీ నోటీసులు అందజేసింది. ఈనెల 4న తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అదే సమయంలో నారాయణను కూడా విచారణకు హాజరుకావాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నెల 4న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు నారాయణను కూడా సీఐడీ అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చే విధంగా..టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను మార్చారని సీఐడీ అభియోగం. ఇందులో భాగంగానే గతేడాది ఏప్రిల్‌లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు, నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్ తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే నారా లోకేశ్‌ను కూడా ఈ స్కాంలో నిందితుడిగా సీఐడీ పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో కొంత మందికి లబ్ధి చేకూరేలా మార్పులు చేయడంలో లోకేశ్ కీలక పాత్ర పోషించారని సీఐడీ ఇప్పటికే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News