కడపలో పోస్టర్ కలకలం: బెంగళూరు రైల్వే లైన్ వేయించే మగాడే లేడా? అంటూ నిలదీత

కడపలో పోస్టర్ కలకలం రేపింది..

Update: 2024-11-10 12:46 GMT

దిశ, వెబ్ డెస్క్: కడపలో పోస్టర్ కలకలం రేపింది. కడప- బెంగళూరు రైల్వే లైన్(Kadapa-Bangalore Railway Line) కోసం అక్కడి ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. కడప-బెంగళూరు రైల్వే లైన్ వేయించే మగాడు, మొనగాడు లేడా అంటూ కడప ఏడు రోడ్ల కూడలి వద్ద పోస్టర్ వేశారు. వైసీపీ(YCP)లో గాని, టీడీపీ(TDP)లో గాని, కాంగ్రెస్‌(Congress)లో గాని సీపీఎం(Cpm)లో గాని రైల్వే లైన్‌ను వేయించే వాళ్లు ఎవరూ లేరా అంటూ పోస్టర్ ద్వారా నిలదీశారు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాగా కడప-బెంగళూరుకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు ఎప్పడి నుంచో అభ్యర్థిస్తున్నారు. అయితే రైల్వే లైన్‌ను 2008-09 రైల్వే బడ్జెట్‌లోనే మంజూరు చేశారు. ఆ తర్వాత ప్రాథమికంగా సర్వే నిర్వహించారు. 28 కిలో మీటర్ల మేర పనులు జరిగాయి. అయితే ఇంత వరకూ రైల్వే లైన్ పూర్తి కాలేదు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, వైసీపీ ఎంపీలు సైతం కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. కానీ పనులు అనుకున్నంత మేర సాగ లేదు. కడప-బెంగళూరు రైల్వే లైన్‌తో (పీలేరు-పుంగనూరు-మదనపల్లి) వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా మెరుగవుతుందని, తద్వారా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. కానీ కడప- బెంగళూరు రైల్వే లైన్‌ పనులు నత్తనడక సాగుతున్నాయి. దీంతో కడప -బెంళపూరు రైల్వే లైన్‌ను వేయించే మొనగాడు, మగాడు లేడా అంటూ ప్రశ్నిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అంటించారు. 

Tags:    

Similar News