Eluru: ఏలూరు మృతుని కుటుంబానికి మంత్రి పార్థసారథి పరామర్శ.. పరిహారం, ఉద్యోగ హామీ
ఏలూరు బాణసంచా పేలుడు ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని మంత్రి పార్థసారథి పరామర్శించారు.
దిశ, వెబ్ డెస్క్: ఏలూరు నగరం తూర్పువీధిలో నిన్న (అక్టోబర్ 31) మధ్యాహ్నం బైక్ పై ఉల్లిపాయ పటాకులు బస్తాతో వెళ్తున్న వ్యక్తి.. దారుణంగా మరణించిన విషయం తెలిసిందే. స్కూటీ గుంతలో పడటంతో చేతిలో ఉన్న బస్తాలో బాంబులు పేలాయి. ఈ ఘటనలో సుధాకర్ మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. అతని శరీరం ఛిద్రమై.. ఆ భాగాలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లపై పడటంతో భీతావహ వాతావరణ పరిస్థితులు కనిపించాయి. మృతుడి కుటుంబాన్ని మంత్రి పార్థసారథి (Pardha Saradhi)శుక్రవారం పరామర్శించారు. పండుగరోజున ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం చాలా బాధాకరమన్న ఆయన.. సుధాకర్ కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున లక్షరూపాయలు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరో రూ.2 లక్షలు పరిహారం అందిస్తామని మంత్రి తెలివారు. అలాగే అతని భార్యకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగమిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలైన క్షతగాత్రులకు ఒక్కొక్కరికీ రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.