ఏపీలో బీజేపీకి ఏకైక ఆప్షన్ అదొక్కటే: పవన్ కల్యాణ్ ఏం చేస్తారో?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయా? టీడీపీ, జనసేన పార్టీలు సైడ్ చేసేశాయా?
దిశ, డైనమిక్ బ్యూరో :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయా? టీడీపీ, జనసేన పార్టీలు సైడ్ చేసేశాయా? నిన్న మెున్నటి వరకు చంకన ఎక్కించుకున్న వైసీపీ సైతం కటీఫ్ చెప్పేసిందా?అసలు ఏపీలో బీజేపీ ముందున్న అంశాలేంటి? టీడీపీ,జనసేనలతో కలిసి పొత్తుతో ఎన్నికలకు వెళ్లాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలోనే కాదు దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి గడ్డు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలోనైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ కనుసన్నుల్లో మెలిగిన పవన్ కల్యాణ్ ఎన్నికల వేళ స్టంట్ మార్చారు. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని అధికారంలోకి వస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో కేవలం బీజేపీతోనే పొత్తు వల్ల వైసీపీని ఓడించలేమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ పరిస్థితి ఏంటనేదానిపై సందిగ్దం నెలకొంది.
ప్రస్తుత పరిస్తితి వేరు
ఏపీలో బీజేపీకి విపత్కర పరిస్థితి నెలకొంది. బీజేపీ పరిస్థితి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. జనసేనతో కలిసి పొత్తులో వెళ్తుందా..? వెళ్తే టీడీపీతో అడ్జస్ట్ అవుతుందా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో టీడీపీ ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో జైల్లో ఉన్నారు. దీంతో టీడీపీకి సానుభూతి పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఇది ప్రభావితం చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు టీడీపీ క్లిష్టమైన సమయంలో పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీ,జనసేన పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు. ఇరు పార్టీలు కలిసి అధికారంలోకి రావడం ఖాయమనే పలు సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి.
ఒప్పించాల్సింది పవనే
ఇకపోతే ఏపీలో బీజేపీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. ఏపీలో అస్సలు ఓటు బ్యాంకు లేదు. జగన్‌తో నేరుగా పొత్తు సాధ్యపడదు. కలసి పోటీ చేయాలంటే అది టీడీపీ, జనసేనతోనే సాధ్యం. అప్పుడు మాత్రమే బీజేపీకంటూ కొన్ని స్థానాలు వస్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఎదుట ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీ,జనసేనతో పొత్తు పెట్టుకోవడం. ఇంతకంటే బీజేపీకి కూడా అంతకంటే వేరే ఆప్షన్ లేదు. తమ వెంట బలమైన మిత్రులున్నారని చెప్పుకోవడం కోసమైనా సైకిల్ ఎక్కక తప్పదన్నది అంచనాలు వినపడుతున్నాయి. మరోవైపు కొందరు బీజేపీ నేతలు సైతం టీడీపీ,జనసేనతో పొత్తుకు సై అంటున్నట్లు తెలుస్తోంంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ త్వరలోనే ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పొత్తుల అనివార్య పరిస్థితిని వివరిస్తారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వివరణతో బీజేపీ అంగీకరిస్తే వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేన, టీడీపీ కలసి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.