యువగళాన్ని నవశకం వైపు నడిపించిన అందరికీ కృతజ్ఞతలు: నారా లోకేశ్
యువగళంని నవశకం వైపు నడిపించిన ప్రతీ ఒక్కరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో : యువగళంని నవశకం వైపు నడిపించిన ప్రతీ ఒక్కరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ దుర్మార్గ పాలనపై ప్రజల్ని చైతన్యం చేసే లక్ష్యంతో కుప్పంలో జనవరి 27న ప్రారంభించి డిసెంబర్ 18న విశాఖలో ముగిసే నాటికి మొత్తం 226 రోజులు పాటు నా వెంట నడుస్తూ నడిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పాదయాత్రలో నేను చూసిన కష్టాలు, గ్రామాల సమస్యలు ప్రజల ముందుంచడంలో ప్రముఖ పాత్ర వహించిన మీడియా యాజమాన్యాలు, జర్నలిస్టులు, సిబ్బంది, నా పీఆర్ టీముకి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను కంటికి రెప్పలా కనిపెట్టుకుని పాదయాత్రలో సంయమనంతో విధులు నిర్వర్తించిన యువగళం టీమ్, వలంటీర్లు అందరికీ నారా లోకేశ్ నమస్కారాలు తెలియజేశారు.‘నన్ను అడ్డుకోవాలని ప్రభుత్వం విపరీతమైన ఒత్తిడి చేసినా లొంగకుండా యువగళంలో బందోబస్తు బాధ్యతలు నిర్వర్తించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. యువగళం పాదయాత్ర ఇంత విజయవంతం కావడానికి కృషి చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, టీడీపీ కార్యాలయ సిబ్బంది, భద్రతాసిబ్బంది, సాంకేతిక సిబ్బందితోపాటు ఈ మహాప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. 97 నియోజకవర్గాలలో ఏ ఊరువెళ్లినా, ఏ పట్టణంలో నడిచినా తమ వాడిగా ఆశీర్వదించి, ఆదరించిన ప్రజలకు నేను రుణపడి ఉంటాను. త్వరలో ఏర్పడబోయే ప్రజాప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమానికి కృషి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను’ అని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.