తిరుమలలో అక్రమాలు... ఏపీ సీఎంకు తెలంగాణ బీజేపీ నేత సంచలన లేఖ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ లేఖ రాశారు....

Update: 2024-07-06 06:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ లేఖ రాశారు. తిరుమల దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి తిరుమల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

‘‘గత ప్రభుత్వ హయాంలో పవిత్ర తిరుమలకు అవినీతి మకిలీ అంటుకుంది. భక్తుల సౌకర్యాలు మృగ్యమయ్యాయి, అన్యమతాల ఉనికితో సనాతన ధర్మానికి విఘాతం వాటిల్లింది. గత కొంతకాలం వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అవినీతి అరోపణలు వచ్చాయి. అర్హతలను బట్టి కాకుండా సొంత మనుషులతో టీటీడీని నింపారు. ఇందులో అన్య మతస్థులు కూడా ఉండడం దారుణం. టీటీడీని ప్రక్షాళన చేసి అన్య మతస్థులను తక్షణమే తొలగించాలి. అర్హతలను అనుసరించి హిందువులతో టీటీడీ నియామకాలు చేపట్టాలి. శ్రీవాణి ట్రస్టుకు రూ.10,000 విరాళం ఇస్తే సామాన్య భక్తులకు కూడా వీఐపీ దర్శనం కల్పించేవారు. ఇలాభక్తుల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది?. ఇది పక్కదారి పట్టిందా.. లేక సక్రమంగా వినియోగం జరిగిందా విచారణ జరిపించాలి. అధికారంలో ఉన్నవాళ్లు తమకు కావాల్సిన వాళ్లకుటీటీడీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. కొనుగోళ్లలో కమిషన్లు నొక్కేశారు. ముఖ్యంగా అన్నదానానికి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఇందుకు ప్రతిఫలంగా టీటీడీ పెద్దలకు భారీగానే చెల్లించుకున్నారని ఆరోపణలు వినిపించాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పక్కదారి పట్టిన సొమ్మును తిరిగి వసూలు చేయాలి.’ అని లేఖలో లక్మణ్ సూచించారు. 

‘శ్రీవారికి భక్తులు ఇచ్చిన కానుకలు, విరాళాలు, హుండీ ఆదాయంపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలి. పక్కదారి పట్టినట్టు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో భక్తిని వ్యాపారమయంగామారుస్తూ వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్లు గణనీయంగా పెంచారు. వ్యాపార కోణంలో కాకుండా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని దర్శనం టికెట్ల ధరలు నిర్ణయించాలి. ఉచిత దర్శనానికి పరిమితి విధిస్తున్నారు. ఆ రోజు పరిమితి దాటి భక్తులు వస్తే, వారిని అక్కడే నిలిపివేస్తున్నారు. ఉచిత దర్శనంపై పరిమితి ఎత్తేయాలి. అందరినీ దర్శనానికి అనుమతించాలి. ఉచిత దర్శన వ్యవస్థను మెరుగుపర్చాలి.’’ అని లేఖలో లక్మణ్ కోరారు.


Similar News