దూకుడు పెంచిన Chandrababu.. క్లస్టర్ వ్యవస్థకు శ్రీకారం

‘హూ కిల్లిడ్ బాబాయ్’ అని గూగుల్‌ని అడిగితే అబ్బాయ్ కిల్లిడ్ బాబాయ్’ అని తేలిపోయింది అంటూ దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. .

Update: 2023-02-24 13:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘హూ కిల్డ్ బాబాయ్’ అని గూగుల్‌ని అడిగితే అబ్బాయ్ కిల్డ్ బాబాయ్’ అని చెబుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైఎస్ వివేకాను హత్య చేసి ఆడిన డ్రామాలు సీబీఐ దర్యాప్తులో వెల్లడయ్యాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గు లేకుండా సీబీఐని తప్పు పడుతున్నారని మండిపడ్డారు. ఏలూరులోని జోన్-2 సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 35 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జి, కుటుంబ సారధిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ప్రాణం అని చెప్పారు. ‘ఇంతకాలం రాజకీయాల్లో పోరాడాం.. నేడు వింత జంతువులతో పోరాడాల్సిన సమయం వచ్చింది. ఈ సైకో జంతువులకు సిగ్గు కూడా ఉండదు.’ అని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.

ఎన్నికలకు సిద్ధం

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రావణాసుర యుద్ధం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థను తాము తప్పు పట్టడం లేదన్నారు. కానీ వలంటీర్‌లు ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేయాలన్నదే తమ అభిమతమన్నారు. వలంటీర్‌లు వైసీపీకి, వైసీపీ నాయకులకు సేవ చేయవద్దని సూచించారు. మరోవైపు గృహ సారథులు కింద సచివాలయ సిబ్బంది, వలంటీర్‌లు ఎందుకు పని చేయాలని చంద్రబాబు నిలదీశారు.

వైసీపీకి రాబోయేది కష్టకాలమే

ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం తెలుగుదేశం ఓ కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. నియోజకవర్గాల్లో 5 వేల ఓటర్లకు క్లస్టర్ ఇన్‌చార్జిలను నియమించినట్లు చెప్పుకొచ్చారు. వారి కింద యూనిట్ ఇన్‌చార్జిలు, బూత్ ఇన్‌చార్జిలు, కుటుంబ సాధికార సారథులు పార్టీకోసం పని చేస్తారని స్పష్టం చేశారు. ఇన్‌చార్జిలు అందరూ పకడ్బందీగా పని చేయాలని క్యాడర్‌కు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సైకో పాలనలో ఉదయం ఓ కేసు, రాత్రి మరో కేసు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ట్రిబ్యునల్ వేస్తామన్నారు. అన్ని అధికారాలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. తప్పుడు కేసులన్నీ ఎత్తి వేయిస్తామని, తప్పలు చేసిన పోలీసులందర్ని జైలుకు పంపుతామని హెచ్చరించారు. వైసీపీ హనీమూన్ ఇక అయిపోయిందని, రాబోయేది వాళ్ళకి కష్టకాలమే అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Tags:    

Similar News