ఫిల్మ్ క్లబ్ నుంచి వెంటనే తప్పుకోండి.. వైసీపీ నేతలకు ఎమ్మెల్యే గంటా స్ట్రాంగ్ వార్నింగ్
విశాఖ ఫిల్మ్ క్లబ్‌లో కమిటీ సభ్యులుగా వైసీపీ నేతలు కొనసాగడంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ప్రభుత్వం మారినా విశాఖలో మాత్రం వైసీపీ నేతలు అధికారం చెలాయిస్తున్నారు. గత వైభోగాలను ఇంకా అనుభవిస్తున్నారు. విశాఖ ఫిల్మ్ క్లబ్‌లో వైసీపీ నేతలు కమిటీ సభ్యులుగా ఇంకా కొనసాగుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న కొంతమంది స్వచ్ఛందంగా తప్పుకున్నారు. కానీ మరికొందరు ఇంకా కొనసాగడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఫిల్మ్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ లాన్స్ బోర్డును తీసివేశారు. సినిమాతో సంబంధం లేకపోయినా వైఎస్సార్ లాన్స్ అని పేరు పెట్టడంపై గంటా ధ్వజమెత్తారు.
మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఫిల్మ్ క్లబ్ కమిటీ సభ్యులపై గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. సినిమాతో సంబంధం లేని వైఎస్ జగన్ బ్యాచ్ కొంతమంది ఫిల్మ్ క్లబ్‌లో కమిటీ మెంబర్లుగా ఎంటర్ అయ్యారని ఆరోపించారు. క్లబ్ ఫండ్ వినియోగంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని, విచారించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిల్మ్ క్లబ్‌లో తిష్ట వేసిన వైసీపీ నేతలు వెంటనే తప్పుకోవాలని సూచించారు. ఏయూ, క్రికెట్ అసోసియేషన్లను వైసీపీ నేతలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా విశాఖ ఫిల్మ్ క్లబ్‌లో శాశ్వత కమిటీ పెట్టారని మండిపడ్డారు. ఫిల్మ్ క్లబ్ నుంచి వైసీపీ నేతలు తప్పుకోకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.