TDP: లోకేశ్‌పై కోడిగుడ్లతో దాడి అమానుషం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై కోడిగుడ్లతో దాడిని టీడీపీ నేతలు ఖండించారు..
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై కోడిగుడ్లతో దాడిని టీడీపీ నేతలు ఖండించారు. వైసీపీ ప్రస్టేషన్‌తోనే దాడులకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ దాడులు చూస్తుంటే వైసీపీ ప్రస్టేషన్ తారా స్థాయికి చేరిందనిపిస్తుందని మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు. లోకేశ్ యాత్రకు స్పందన చూసి వైసీపీకి నిద్రపట్టడం లేదని అందువల్లే దాడులకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రత్యక్ష దాడులు పాదయాత్రను ఆపలేవు అని హెచ్చరించారు. దాడికి ప్రతిదాడికి తాము సిద్ధమని కేఎస్ జవహర్ ప్రకటించారు. పాదయాత్రకు ఆటంకాలు కల్పిస్తున్నారు. పాద యాత్ర దండ యాత్ర కాకుండ చూసుకోండి అని సూచించారు. జగన్ లోకేశ్‌ను చూసి భయపడుతున్నారు. భయంతో పిరికిపందలు దాడికి ఉసి కోల్పోతున్నారు అని మండిపడ్డారు. లోకేశ్‌కు హాని జరిగితే జగన్‌దే బాధ్యత అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం జగన్ పాలనలో కనుమరుగవుతుంది అని కేఎస్ జవహర్ అన్నారు.
మరోవైపు చింతకాయల విజయ్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఇద్దరు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తలుచుకుంటే ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండగలిగే వారా అని ప్రశ్నించారు. నేడు అధికారం ఉందని లోకేశ్‌పై దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ అధికారం మీకు శాశ్వతమా? ఇటు వైపు కూడా తరం మారింది తీరు మారింది .. రాజకీయ ఉన్మాదంతో విర్రవీగుతున్న కొంత మంది అధికారులనీ మళ్ళీ హెచ్చరిస్తున్నాం. అన్నీ గుర్తుపెట్టుకుంటాం వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం అని హెచ్చరించారు. రెచ్చిపోతున్న వైసీపీ సైకోలు కూడా భూమి గుండ్రంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరించారు.
డీజీపీ భద్రత కల్పించాలి : బొండా ఉమా
లోకేశ్ పాదయాత్రపై ప్రొద్దుటూరులో వైసీపీ రౌడీ ముకల దాడి అమానుషం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. జగన్ రెడ్డి సొంత జిల్లలోనే వైసీపీ ఉనికి కోల్పోయే పరిస్థితిని తట్టుకోలేకే ఈ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమలో లోకేశ్ పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చింది. డీజీపీ లోకేష్ పాదయాత్రకు భద్రత పెంచాలి అని డిమాండ్ చేశారు. అన్ని అనుమతులు ఉన్నా వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సమక్షంలో దాడి చేశారు అని ఆరోపించారు. లోకేశ్ పాదయాత్రకు భద్రత పెంచమని డీజీపీని కలవబోతున్నట్లు తెలిపారు. లోకేశ్ పాదయాత్ర పై వైసీపీ దాడినీ ప్రజలే తిప్పి కొడతారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు.
ఇకపోతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వైఎస్ఆర్ కడప జిల్లాలో కొనసాగుతుంది. అయితే 113వరోజు పాదయాత్రలో నారా లోకేశ్‌పై కొందరు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మైదుకూరు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండు, కొత్తపల్లి బైపాస్ మీదుగా కొత్తపల్లి పిఎన్‌ఆర్ ఎస్టేట్ వద్ద విడిది కేంద్రానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జనాలను పలకరిస్తూ.. వారి సమస్యలు ఆలకిస్తూ కొత్తపల్లి రిలయన్స్ పెట్రోలు బంకు సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లారు. అక్కడ బజ్జీలు తిని డబ్బులు ఇస్తుండగా ఓ వైసిపి కార్యకర్త లోకేశ్‌పై గుడ్డు విసిరారు. అది బద్వేలు టీడీపీ నేత రితీశ్‌కుమార్‌రెడ్డిని, లోకేశ్‌ను తాకి అంగడి యజమానిపై పడింది. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే అతడిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పిన సంగతి తెలిసిందే.