AP DEBT: ఒక్కో కుటుంబంపై అప్పు రూ.4.50 లక్షలు

అధికారంలోకి వచ్చాక అరాచకం తప్పించి అభివృద్ధి ఊసే ఎత్తని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విశాఖలో కాపురం పెడతాననడం ఎవరిని ఉద్దరించడానికి? అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు....

Update: 2023-04-20 14:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారంలోకి వచ్చాక అరాచకం తప్పించి అభివృద్ధి ఊసే ఎత్తని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విశాఖలో కాపురం పెడతాననడం ఎవరిని ఉద్దరించడానికి? అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని తాడేపల్లి నేలమాళిగలు నింపుకున్నది చాల్లేదా? అని ఆయన నిలదీశారు. ‘ఇప్పటికే మూడు రాజధానుల పేరుతో ప్రజా రాజధాని అమరావతిని చంపేశారు. విశాఖలో రాజధాని మాటున రూ. 40 వేల కోట్లు కొల్లగొట్టారు. కొండలు, గుట్టలు అనే తేడా లేకుండా కబ్జా చేసేశారు. దోచుకున్నది సరిపోక మళ్లీ విశాఖలో కాపురం అంటున్నారా?. మీరు మోపిన ధరల భారంతో, పన్నుల మోతతో పేదలు కడుపునిండా తిండి తినే పరిస్థితి లేదు. ఈ నాలుగేళ్లలో కొత్త పరిశ్రమల ఊసే లేదు. జే ట్యాక్స్ చెల్లించలేక పారిశ్రామికవేత్తలు పారిపోయారు’ అని ఆరోపించారు. ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతున్నారని, జాబ్ క్యాలెండర్ అంటూ నాలుగేళ్ల నుంచి అరచేతిలో వైకుంఠం చూపిస్తూనే ఉన్నారని, చేసిన అరాచకాలు చాలక విశాఖ వెళతారా? అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

అప్పులు తెచ్చి ఖజానా నింపుకున్న జగన్

ఈ నాలుగేళ్లలో కొన్ని పథకాలను నిర్దాక్షణ్యంగా రద్దు చేసి మరికొన్నింటికి పేర్లు మార్చుకోవడం మినహా చేసింది ఏముంది జగన్ రెడ్డి? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ‘రాష్ట్రానికి పెట్టుబడుల వరద అని మంత్రులు ఆర్భాటపు ప్రకటనలు ఇస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డేమో ... నిధుల్లేక పథకాలు వాయిదా వేశామంటున్నారు. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ పాలన వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. పథకాల మాటున భారీ అవినీతికి పాల్పడి, దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచున నిలబెట్టింది జగన్ రెడ్డి కాదా?.’ అని ప్రశ్నించారు. ‘ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా రూ.7 లక్షల కోట్లు. ఈ అప్పుల వల్ల ఒక్కో కుటుంబంపై నాలుగున్నర లక్షల భారం పడింది.అప్పులు తెచ్చి సొంత ఖజానా నింపుకోడం మినహా గజం అభివృద్ధి చేయని ముఖ్యమంత్రి కల్లబొల్లి మాటలతో ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు? అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

రావణాసుర పాలనకు చరమగీతం పట్టడం ఖాయం

పోర్టుల పేరుతో నాలుగేళ్లుగా హడావుడి చేస్తున్నారేకానీ ఒక్కటైనా పూర్తి చేశారా? అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు?. గత టీడీపీ ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి భూములు కూడా కేటాయించింది. కొత్తగా మీరు చేసిందేంటో సమాధానం చెప్పగలరా? అని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు పోర్టులకు రిబ్బన్ కటింగ్ చేయడం, పెట్టుబడుల సదస్సు పేరుతో హడావుడి చేయడం దేనికి సంకేతం?. మీ చేతకాని పాలనతో సరై ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయినా వాస్తవాన్ని ముఖ్యమంత్రి అంగీకరించాల్సిందేనని చెప్పారు. ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రవాణాలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపి, పేదల బతుకులు దుర్భరం చేసిన జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో పబ్జీ ఆడినా , విశాఖలో కాపురం పెట్టినా ఎవరికీ ప్రయోజనం లేదని విమర్శించారు. ‘నాలుగేళ్ల జగన్ రెడ్డి పాలనలో ఏపీ 40 ఏళ్లు వెనక్కుపోయింది. జగన్ రెడ్డి ఏ జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఈ రావణాసుర పాలనకు చరమగీతం పాడతామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైసీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అతికించినా, జగన్ రెడ్డే స్వయంగా జనాల చుట్టు చక్కర్లు కొట్టినా రాజకీయ ప్రయోజనం శూన్యం. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం. తెలుగుదేశం గెలుపు ఖాయం.’ అని యనమల రామకృష్ణుడు ధీమా వ్యక్తం చేశారు

ఇవి కూడా చదవండి : Amarnath: విశాఖ రాజధానికి అనుకూలమా..ప్రతికూలమా?

Tags:    

Similar News