లోకేష్‌కు ప్రాణహాని ఉంది.. డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ

లోకేష్‌కు ప్రాణహాని ఉందని డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు.

Update: 2023-06-03 11:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : నారా లోకేష్‌కు రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో ప్రాణహాని ఉందని, కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయని విమర్శలు గుప్పించారు. ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో లోకేష్‌కు ప్రాణహాని ఉందని అనేకమార్లు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు రామయ్య గుర్తుచేశారు. కానీ, సంబంధిత అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. యువగళం పాదయాత్రపై ఓ వర్గం పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో టీడీపీ అథినేత చంద్రబాబు నాయుడిపై అసభ్యకర పదజాలంతో ప్లెక్సీలు వేశారని ఆరోపించారు. దీనిపై నారా లోకేష్ స్థానిక పోలీసుల అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆశ్చర్యకరంగా ప్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై డీఎస్పీ నాగరాజు, ఎస్.ఐ రాజారెడ్డి, ఇబ్రహీంలు చర్యలు తీసుకోవడం మాని ఫ్లెక్సీలు వేయడంను సమర్ధించారని వర్త రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో జూన్ 1న వైసీపీ మద్దతుదారులు పాదయాత్ర చేస్తున్న లోకేష్‌పై కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు విసిరారని పేర్కొన్నారు. కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు విసిరినవారి వెనుక పోలీసులు ఉండటం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌కు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై క్రిమినల్ కేసు బుక్ చేయాలని....లోకేష్‌కు రక్షణ కల్పించడంలో తమ బాధ్యతలను విస్మరించిన పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య లేఖలో డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

మిస్సైన వారి ఫోటో, వివరాలు వాట్సాప్ చేయండి  

Tags:    

Similar News