వివేక హత్య వెనుక పెద్దకుట్ర దాగి ఉంది.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగడుగునా అబద్ధాలుచెబుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. వివేకానందరెడ్డి హత్యకేసుతో ముఖ్యమంత్రి జగన్‌కి ఏం సంబంధం లేదని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వర్ల మాట్లాడుతూ... ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పిన జగన్ రెడ్డి...ముఖ్యమంత్రి అయ్యాక కూడా అబద్ధాలపరంపర కొనసాగిస్తున్నారని విమర్శించారు, వైఎస్ జగన్ ఎందుకిలా చేస్తున్నారని ఎవరైనా ఆలోచిస్తే, వివేకాను చంపిన వ్యక్తులు ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులని స్పష్టమవుతోంది అని ఆరోపించారు. వారిని రక్షించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడని తంటాలు లేవు...ఎక్కని మెట్లులేవు...మొక్కని దేవుడు లేడు అని విమర్శించారు.
సీబీఐ 2023, మే 26న హైకోర్ట్ లో దాఖలుచేసిన పిటిషన్‌లో వివేకాహత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసునని...ఈ హత్యవెనుక విశాలమైన కుట్రదాగి ఉందని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. సీబీఐ పిటిషన్‌లోని అంశాలపై ముఖ్యమంత్రి ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి తనకేం తెలియదన్నట్లు బుకాయిస్తారు. సీబీఐ చెప్పిన విశాలమైన కుట్ర ఏమిటో, వివేకాహత్య ఎందుకు జరిగిందో, దానివెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి 5కోట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పుకొచ్చారు. వివేకా హత్యతో మీకు ఎలాంటి సంబంధంలేదని చెప్పగలరా? వివేకా హత్యకేసులో వేళ్లన్నీ మీ వైపు, మీ శ్రీమతివైపే చూపిస్తున్నాయి అని వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా మీరు పెదవి విప్పి భావితరాలకు ఆదర్శంగా నిలవండి అని సూచించారు.
వివేకాహత్యలో మీ ప్రమేయాన్ని సీబీఐ కోర్టు చెప్పాక కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం కాదా అని నిలదీశారు. వివేకాహత్య కేసులో సీబీఐ విచారణపై ప్రజలు పెదవివిరుస్తున్నారు. ఈ కేసు విచారణను కడపలోని సబ్ ఇన్ స్పెక్టర్‌కు అప్పగించి ఉంటే...నిందితులంతా ఈపాటికే ఊచలు లెక్కపెడుతుండేవారు అని చెప్పుకుంటున్నారు. అవినాశ్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తే పండగ చేసుకుంటారా? బెయిల్ వస్తే నిర్దోషులు అవుతారా? బాణసంచాకాల్చి స్వీట్లు తినిపించుకుంటారా? 11 కేసుల్లో మీరు బెయిల్ పై ఉన్నారు ముఖ్యమంత్రి, వాటిలో మీకు బెయిల్ వస్తే మీరు నిర్దోషి అవుతారా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు.