Pattabhi: సంకల్ప సిద్ధితో కోట్లు కొట్టేశారు.. కొడాలి, వల్లభనేని‌పై సంచలన ఆరోపణలు

సంకల్ప సిద్ధి సంస్థ ముసుగులో రూ.1100కోట్ల పేదల సొమ్మును మాజీమంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌లు కొట్టేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన ఆరోపణలు చేశారు....

Update: 2022-11-25 14:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సంకల్ప సిద్ధి సంస్థ ముసుగులో రూ.1100కోట్ల పేదల సొమ్మును మాజీమంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌లు కొట్టేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన ఆరోపణలు చేశారు. సంకల్ప సిద్ధి సంస్థ పేరుతో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను నిలువునా ముంచేశారని ఆరోపించారు. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా ఆధ్వర్యంలో ఈ భారీ స్కామ్ జరిగిందని ధ్వజమెత్తారు. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో రూ.1100కోట్ల ప్రజల సొమ్మును స్వాహా చేశారని ఆ సొమ్ముతో హైదరాబాద్, బెంగళూరులో నాని, వంశీలు బినామీ పేర్లతో భూ కొనుగోళ్లు చేశారని ఆరోపించారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ఉగ్రవాది జగన్ రెడ్డి ఏలుబడిలో ఇదంతా జరిగిందన్నారు. తొలుత రూ.20 వేలు సంస్థలో పెట్టుబడి పెడితే రోజుకి రూ.200 చొప్పున 10 నెలల్లో రూ.60వేలు తిరిగిస్తారని, సంకల్పసిద్ధి ఈకార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏజెంట్లు ప్రజల్ని మోసగించిందని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు రూ.1100కోట్ల కుంభకోణం సీఐడీ చీఫ్‌కి కనిపించడంలేదా? అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. సీఐడీ విభాగాన్ని కేవలం ప్రతిపక్షనేతలు, గిట్టనివారిపై దాడులు చేయించేందుకే వినియోగించడం మీ స్వామి భక్తికి నిదర్శనం కాదా సునీల్ కుమార్? అని ప్రశ్నించారు. సంకల్పసిద్ధి సంస్థ కుంభకోణంపై డీజీపీ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని, విచారణ వివరాలు నేటికీ ఎందుకు బయటపెట్టలేదని పట్టాభిరామ్ ప్రశ్నించారు. సంకల్పసిద్ధి కుంభకోణం గురించి గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లోని ప్రజల్ని అడిగితే, గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్‌లు ఎవరు...నాలుగేళ్లక్రితం వారికున్న ఆస్తులు, వారికి ఓలుపల్లికి రంగాకు ఉన్న సంబంధం.. రంగాకు కొడాలినాని, వల్లభనేని వంశీలతో ఉన్న అనుబంధం అన్నీ బయటకొస్తాయని పట్టాభిరామ్ అన్నారు. 


Similar News