రిజిస్ట్రార్ కార్యాలయమా లేక వైసీపీ కార్యాలయమా?.. పరిటాల శ్రీరామ్

ధర్మవరంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వైసీపీ కార్యాలయంగా మారిందని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.

Update: 2023-02-07 15:10 GMT

దిశ, ధర్మవరం: ధర్మవరంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వైసీపీ కార్యాలయంగా మారిందని మంగళవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కాలనీల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. దశాబ్దాలుగా ఎంతో మంది నివాసం ఉంటున్న ఈ స్థలాన్ని కాజేయాలని చూస్తున్న నేపథ్యంలో వివాదం రాజుకుందని, ఇప్పటికే ఇక్కడ రెండు సర్వే నెంబర్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు, ఇతర కార్యకలాపాలు ఆపేయాలని కోర్టు ఆదేశాలున్నాయి. అయినప్పటికీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలుసుకున్న శ్రీరామ్ నేరుగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇక్కడ ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్లు, కోర్టు ఆదేశాలను చూపించారు. అసలు వివాదాల్లో ఉన్న భూములకు, ప్రభుత్వ స్థలాలను ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని శ్రీరామ్ ప్రశ్నించారు. అయితే తమ వద్ద నిషేధిత జాబితా లేదని చెప్పడంతో శ్రీరామ్ ఒకింత ఆశ్చర్య పోయారు. మున్సిపాలిటీ ఏర్పడి ఇన్నేళ్లు అయినా.. కనీసం నిషేధిత జాబితా లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రెండు సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్లు చేయవద్దని శ్రీరామ్ కోరారు. మరోసారి ఇది జరిగితే కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన కింద ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అంశాలు చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా ప్రభుత్వ స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు. దీని వెనుక ఎవరున్నారో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. నిషేధిత జాబితాను తామే మున్సిపల్, రెవెన్యూ అధికారుల వద్ద నుంచి తీసుకొచ్చి.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని నోటీసు బోర్డులో అతికిస్తామ్నారు. మరోవైపు కాలనీల్లో రోడ్లను కూడా కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుంటన్నారని.. పరిస్థితి ఇలానే ఉంటే ఒక కాలనీ నుంచి మరో కాలనీకి వెళ్లాలంటే టోల్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొందరు బ్రోకర్లు చెప్పిందే రాజ్యంగా నడుస్తోందన్నారు. ఎవరి భూములు రిజిస్ట్రేషన్లు చేయించాలి.. ఎవరివి చేయించకూడదో వారే నిర్ణయిస్తున్నారన్నారు. అలా రిజిస్ట్రేషన్లు కాకుండా కొందరు యజమానులను ఒత్తికి గురయ్యేలా చేసి.. దానిని చాలా తక్కువ ధరకు వారే కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇలాంటి విషయాల వెనుక అధికార పార్టీ నేతల హస్తమున్నట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. గతంలో రిజిస్ట్రేషన్లకు డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకుని రండి అంటూ ఎమ్మెల్యే బోర్డు పెట్టారని.. అయితే ఇప్పుడు ఆ బోర్డు ఏమైందో చెప్పాలన్నారు. మేము ఆ బోర్డు మళ్లీ వేయిస్తామని.. ముందు అక్రమ రిజిస్ట్రేషన్లు ఆపాలన్నారు.

ఇక్కడ జరిగే ప్రతి రిజిస్ట్రేషన్ మీద కమీషన్లు కూడా వెళ్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. మరోవైపు 1954కు ముందు భూములకు మాత్రమే ఎన్ఓసీలు వస్తాయని.. కాని ఇక్కడ మాత్రం 1960 నుంచి ఎప్పటి భూములకైనా ఎన్ఓసీలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారన్నారు. ఇలాంటి వాటి విషయంలో బాధితులు అప్రమత్తంగా ఉండాలని.. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుంటుందన్నారు. దయచేసి ప్రజలందరూ ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని శ్రీరామ్ సూచించారు. ధర్మవరంలో ఎమ్మెల్యే అతని అనుచరుల దౌర్జన్యాలకు బాధితులుగా మారుతున్న వారు ధైర్యంగా ముందుకు రావాలని.. ఈ పాలన ఏడాది కూడా ఉండదని.. పోరాడాల్సిన సమయం వచ్చిందని శ్రీరామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జీ20 దేశాల ప్రతినిధులు

Tags:    

Similar News