టీడీపీ- జనసేనల సమన్వయ కమిటీ రెండో సమావేశానికి వేదిక ఖరారు.. ఈనెల 9న భేటీ

ఈనెల 9న టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం జరగనుంది.

Update: 2023-11-06 07:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఈనెల 9న టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌, టీడీపీ నుంచి నారా లోకేశ్, యనమల రామకృష్ణుడులు హాజరుకానున్నారు. వీరితో పాటు అటు జనసేన నుంచి మరో ఐదుగురు, టీడీపీ నుంచి మరో ఐదుగురు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి టీడీపీ, జనసేన పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి ఇరు పార్టీల నుంచి చెరో ఆరుగురు సభ్యులు నియమితులయ్యారు. జనసేన పార్టీ తరఫున ఆరుగురు, టీడీపీ నుంచి ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. అనంతరం అక్టోబర్ 23న రాజమహేంద్రవరంలోని మంజీర హోటల్‌లో టీడీపీ-జనసేన పార్టీ తొలి సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో టీడీపీ నుంచి నారా లోకేశ్‌తోపాటు మరో ఆరుగురు సభ్యులు, ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు మరో ఆరుగురు సభ్యులు హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా ఈనెల 9న రెండో భేటీ టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పన పై చర్చ జరగనుంది. అలాగే ఈ సమావేశం వేదికగా రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లడంపై చర్చించనున్నారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు

ఇదిలా ఉంటే తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు మెుదలైనట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ షణ్ముఖ వ్యూహం పేరుతో 6 ప్రతిపాదనలను చంద్రబాబు నాయుడు ఎదుట పెట్టినట్లు తెలుస్తోంది. ఈ షణ్ముఖ వ్యూహంలో ప్రధానంగా మెుదటి అంశంగా అమరావతి రాజధానిగా కొనసాగింపు... విశాఖ, తిరుపతి, విజయవాడను క్లస్టర్ల వారీగా మహానగరాలుగా అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు సంపన్న ఏపీ పేరిట వివిధ రంగాలకు ఆర్థిక ప్రోత్సాహం... వ్యవసాయం-బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు. చిన్న నీటి పారుదల రంగాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలను పవన్ కల్యాణ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలాగే మన ఏపీ-మన ఉద్యోగాలు పేరుతో ప్రతీ ఏడాది పోస్టుల భర్తీ ప్రక్రియ. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు వంటి అంశాలను ప్రతిపాదించారు. అలాగే ‘చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలకు రూ.10 లక్షల సాయం. చిన్న పరిశ్రమలకు చేయూతతో ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక... ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చేయూత. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఇళ్లకు ఉచితంగా ఇసుక పంపిణీ’ వంటి అంశాలను పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ అంశాలను ఉమ్మడి మేనిఫెస్టోగా ప్రకటిస్తే ఎలా ఉంటుందని ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై కో ఆర్డినేషన్ సమావేశంలోనూ మళ్లీ చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News