ఎమ్మెల్యే కొలికిపూడికి చంద్రబాబు ఫోన్.. వెంటనే దీక్ష విరమణ

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు...

Update: 2024-09-30 16:52 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు(Thiruvuru MLA Kolikipudi Srinivasa Rao)కు టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu) ఫోన్ చేశారు. దీక్ష విరమించాలని కోరారు. దీంతో కొలికిపూడి వెంటనే దీక్షను విరమించారు. తనపై వచ్చిన ఆరోపణలపై కొలికిపూడి సీరియస్ అయ్యారు. చిట్టేల సర్పంచ్ భార్య తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని తిరువూరులో నిరవధిక దీక్షకు దిగారు. నిజం తేలేవరకూ ఎటూ కదలనంటూ భీష్మించారు. లేదంటే న్యాయపరంగా పోరాటం చేస్తానని హెచ్చరించారు. తన తప్పుంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. తన తప్పు లేదని తేలితే చిట్టేల సర్పంచ్‌ను, ఆయన భార్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

చిట్టేల సర్పంచ్ శ్రీనివాసరావు పేకాట ఆడుతూ ఇటీవల పోలీసులకు చిక్కారు. దీంతో ఆయనపై ఎమ్మెల్యే కొలికిపూడి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కొలికిపూడి తీరును వ్యతిరేకిస్తూ స్థానిక టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో తనపై వచ్చిన ఆరోపణలు నిరూపించాలని కార్యకర్తలతో కలిసి కొలికిపూడి శ్రీనివాసరావు నిరవధిక దీక్షకు దిగారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు.. కొలికిపూడి శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మాట్లాడారు.


Similar News