'జన్మభూమి స్పూర్తితో గ్రామాల అభివృద్దికి అంతా కలిసి రావాలి'

'క్రాంతి అంటే అభ్యుదయం సంపద పరంగా, సంస్కృతి పరంగా పురోగతిని ఆశిస్తూ వచ్చే పండుగ సంక్రాంతి.

Update: 2023-01-13 09:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : 'క్రాంతి అంటే అభ్యుదయం సంపద పరంగా, సంస్కృతి పరంగా పురోగతిని ఆశిస్తూ వచ్చే పండుగ సంక్రాంతి. భోగి- సంక్రాంతి- కనుమ...ఈ మూడు రోజుల సంక్రాంతి పండుగ తెలుగునాట పల్లెల్లో సందళ్లు, సరదాలు, జ్ఞాపకాలు పంచే అతి పెద్ద పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ తమతమ మూలాలైన పల్లెసీమలకు తరలివచ్చి ఆత్మీయతను పంచుకునే విశిష్టమైన పండుగ' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని నాడు ఆలోచించామన్నారు. అందులో భాగంగానే ఆర్థిక స్థోమత లేని వారి ఇంట్లో కూడా పండుగ శోభ కనిపించాలని సంక్రాంతి కానుకలు ఇచ్చామన్నారు. అంతేకాదు రంజాన్, క్రిస్మస్ పర్వదినాలకి కూడా పండుగ కానుకలిచ్చాం. 1కోటి 17 లక్షల కుటుంబాలకు సంక్రాంతి కానుక ఇచ్చామన్నారు.

12 లక్షల మందికి రంజాన్ కానుక, 18 లక్షల మందికి క్రిస్మస్ కానుకలు కూడా అందించామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని తమిళనాడులో కూడా సంక్రాంతి కానుకల పంపిణీ ప్రారంభించారు. అలాంటిది నేటి ప్రభుత్వం ఆ దిశగా కనీస ఆలోచన చెయ్యకపోవడం పేదల పట్ల వారికున్న అప్రాధాన్యతకు నిదర్శనం అని చంద్రబాబు విమర్శించారు. సంక్రాంతి అంటేనే సాగు, సౌభాగ్యాలకు పట్టం కట్టే పండుగ. రైతుల కృషి ఫలించి పంటలు ఇళ్లకు చేరే సంతోష సమయం. సాగు వ్యయం తగ్గించి, పంటకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడే అన్నదాతకు అసలైన సంక్రాంతి అని భావించాం. నాటి ప్రభుత్వంలో 58.29 లక్షల మంది రైతులకు రూ. 15,279 కోట్ల రుణమాఫీ చేసినా... అన్నదాత సుఖీభవ పథకం తీసుకువచ్చినా...పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ అమలు చేసినా వ్యవసాయాన్ని నిలబెట్టాలనేదే మా ఆలోచన. రైతు రథం కింద ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు సబ్సిడీలతో రైతన్నలకు తోడుగా నిలిచామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రవాసాంధ్రులు గ్రామాభివృద్ధికి సహకరించండి

సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ విదేశాల నుండి స్వగ్రామాలకు తరలి వస్తున్న వివిధ రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన మీరు గ్రామాభివృద్దికి ఇతోధికంగా సహాయం చేయాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ పండగ సందర్భంగా ఆ దిశగా సంకల్పం తీసుకోవాలని కోరారు. గతంలో జన్మభూమి అనే కార్యక్రమంతో గ్రామాలను అభివృద్ది చేసుకున్నాం. అప్పట్లో ప్రవాసాంధ్రులు కదలి వచ్చి పల్లెల్లో బడులు, రోడ్లు, తాగునీటి సౌకర్యాలకు చేయూతనిచ్చారు. నాటి జన్మభూమి ఇచ్చిన అద్భుత ఫలితాలు ఇప్పటికీ అందరికీ గుర్తే. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నాటి ఆ స్ఫూర్తి మళ్ళీ తెలుగువారిలో కలగాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుంటేనే నిజమైన పండుగ అనే సిద్దాంతాన్ని నమ్మి రాష్ట్రాభివృద్దిలో మీరంతా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ మరోసారి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు.


Similar News