AP News:స్వర్ణాంధ్ర - 2047 లోని లక్ష్యాలను సాధించాలి:జిల్లా కలెక్టర్

అన్నమయ్య జిల్లాకు సంబంధించిన స్వర్ణాంధ్ర - 2047 లోని లక్ష్యాలను సాధించేందుకు అధికారులందరూ కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు.

Update: 2024-10-24 15:20 GMT

దిశ, రాయచోటి: అన్నమయ్య జిల్లాకు సంబంధించిన స్వర్ణాంధ్ర - 2047 లోని లక్ష్యాలను సాధించేందుకు అధికారులందరూ కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, స్వర్ణాంధ్ర - 2047 పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి మరియు 686 మండలాల నుండి స్వర్ణాంధ్ర - 2047 పై విజన్ పత్రాలు అందాయని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. విజన్ పత్రాలను రూపొందించిన అనంతరం జిల్లాలు మరియు మండలాల పనితీరుపై సూచికలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

గౌరవ ప్రధాన మంత్రి చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప మంత్రివర్యుల సమక్షంలో త్వరలో స్వర్ణాంధ్ర 2047 కు సంబంధించిన పూర్తి నివేదికను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు రాబోతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, అన్నమయ్య జిల్లాకు సంబంధించిన స్వర్ణాంధ్ర - 2047 గురించి మాట్లాడుతూ.... అన్నమయ్య జిల్లాలో పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, నైపుణ్య అభివృద్ధి, తదితర రంగాలలో మంచి అవకాశాలు ఉన్నాయని, వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లో మన జిల్లాకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ సత్యనారాయణరావు, సిపిఓ వెంకట్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News