Minister Parthasarathy:రైతు బజార్‌లో అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు
నూజివీడు రైతు బజారులో కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తే ఉపేక్షించబోమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు.
దిశ, నూజివీడు: నూజివీడు రైతు బజారులో కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తే ఉపేక్షించబోమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. రైతు బజారులో ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నట్లు మంత్రి పార్థసారథి దృష్టికి కొంతమంది వినియోగదారులు తీసుకువచ్చారు. దీనిపై స్పందిస్తూ రైతుబజారులో పేద, సామాన్య ప్రజలకు కూరగాయల ధరలు అందుబాటులో ఉండాలని, ధరలు భారం కాకూడదని ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బజారులు ఏర్పాటు చేసిందన్నారు. అటువంటి రైతు బజారులో తమకు నచ్చినట్లు అధిక ధరలు వసూలు చేస్తే ఇటు అధికారులకు, కూరగాయల విక్రయదారుల పై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
రైతు బజారులో అధిక ధరలు వసూళ్లు చేస్తే సంబంధిత విక్రయదారుల లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రతి రోజు నిర్ణయించిన ధరలకు విక్రయదారులు అమ్ముతున్నది లేనిది సంబంధిత రైతు బజార్ ఎస్టేట్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రైతు బజారులో ప్రతిరోజు ధరల పట్టిక తప్పని సరిగా ప్రదర్శించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు బజారులో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. మంత్రి ఆదేశాలతో వెంటనే రైతుబజారు అధికారులు విక్రయదారులందరికి సంబంధిత ఆదేశాలు జారీ చేశారు.