BJPతో సాఫ్ట్ వైఖరి.. ఆ రెండు పార్టీలకు షాక్ తప్పదా..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ ఒకటేనన్న భావం తమ కొంప ముంచిందని ఆ పార్టీ నేత రాంమాధవ్ స్పష్టం చేశారు.
దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ ఒకటేనన్న భావం తమ కొంప ముంచిందని ఆ పార్టీ నేత రాంమాధవ్ స్పష్టం చేశారు. ఇప్పటికీ ఇదే నానుడి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకతకు తోడు రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీతో వైసీపీ లోపాయికారిగా కలవడాన్ని ప్రజలు తీవ్రంగా గర్హిస్తున్నారు. ప్రధానంగా మధ్య తరగతి వర్గం బీజేపీ అంటేనే మండిపడుతోంది. అక్కడ మోడీ ఆదేశిస్తారు.
ఇక్కడ జగన్ అమలు చేస్తారనేది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. ఇదే ప్రచారం ముమ్మరమైతే వైసీపీ ముస్లిం, ఎస్సీ ఓటు బ్యాంకులకు గండిపడినట్లేనని ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు మోడీని పొగిడి తమ నెత్తిన పాలు పోశారనే భావం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరితే ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు తడుముకోవాల్సి వస్తుంది.
పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీ ఏదైనా ఆటోమేటిక్‌గా చట్టమవుతుంది. దీని ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఈ విషయంలో బీజేపీ ద్రోహం చేసిందని ప్రజలు భావిస్తున్నారు. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కొర్రీలు వేయడంపై కేంద్ర సర్కారు పట్ల గోదావరి జిల్లాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును తెగనమ్మాలనే నిర్ణయంపై ఉత్తరాంధ్ర వాసులు మండిపడుతున్నారు. విశాఖ రైల్వే జోన్, కాకినాడ–విశాఖ పెట్రో కారిడార్ ఏవంటూ నిలదీస్తున్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే అరకొర ప్యాకేజీని కూడా నిలిపేయడంపై భగ్గుమంటున్నారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచినందుకు ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. వీటన్నింటికీ టీడీపీ, జనసేన ఏం సమాధానం చెబుతాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Read more: